కేంద్రంలో మూర్ఖ సర్కారు ఉందని, వరిధాన్యం కొనుగోలుపై పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో పండే యాసంగి ధాన్యాన్ని కొనాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి విన్నవిస్తే అవమానించి పంపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ, రా రైస్, బాయిల్డ్ రైస్ అనే నిబంధనలు పెట్టకుండా తెలంగాణలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రాన్ని తాము కోరామన్నారు. మంత్రుల బృందం ఢిల్లీ వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వకుండా సతాయించారని, ఎందుకు వచ్చారంటూ అవమానించారని కేంద్ర సర్కారుపై మండిపడ్డారు. ప్రతి ఏటా ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానిదేనని చెప్పారు. కానీ, కేంద్రం.. రా రైస్, పారాబాయిల్డ్ రైస్ అంటూ ఇబ్బంది పెడుతోందన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు రైతులపై ఏ మాత్రం ప్రేమలేదని, కార్పొరేటర్లకు వత్తాసు పలికే ప్రభుత్వమని దుయ్యబట్టారు. కేంద్రంలో తలాతోకాలేని ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.