జమ్మికుంట : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలను ఉద్ధరించే ఒక్క పథకాన్ని కూడా తేలేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జమ్మికుంట మండలం ధర్మారంలో గౌడ కుల సంఘానికి మంజూరైన రూ.20 లక్షల నిధుల ప్రొసిడింగ్ పత్రాలను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్తో కలిసి మంత్రి శనివారం అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రజలను మాయ మచ్చీంద్ర చేస్తున్నాడని ఆరోపించారు.
దేశాన్ని అప్పుల పాలుచేసి సర్వ నాశనం పట్టిస్తున్నాడని అన్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశానికి తలమానికంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతున్నదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం చేస్తున్న కృషి మరే రాష్ట్రంలో లేదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలు, కులాలను గౌరవిస్తూ ఆదరిస్తున్నారని పేర్కొన్నారు.
అంతేకాకుండా వృత్తి కులాలు, కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి విలువైన స్థలాలను సైతం కేటాయించడమే కాక నిధులు మంజూరు చేశారని గుర్తుచేశారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, టీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు రాజ్ కుమార్, కౌన్సిలర్ వీరన్నగౌడ్, సింగిల్ విండో చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.