జగిత్యాల, జనవరి 12 : కేంద్రంలో ఉన్నది రైతు మోసకారి ప్రభుత్వమని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. బుధవారం జగిత్యాల జిల్లా వెల్గటూర్‌లో మంత్రి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వరుసగా రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకొంటూ, వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నదని మండిపడ్డారు. రైతులను తమ భూముల్లోనే కూలీలుగా మార్చేందుకు కుట్రచేస్తున్నదన్నారు. రాష్ట్రంలో రైతులు పచ్చగా ఉండటం ఇష్టం లేని మోదీ సర్కారు.. యాసంగిలో బాయిల్డ్ రైస్‌ను తీసుకోబోమని కొర్రీలు పెట్టిందని ధ్వజమెత్తారు.గత వానకాలం సీజన్లో ఉన్న ఎరువుల ధరలు ప్రస్తుతం యాభై శాతానికిపైగా పెరిగాయని, ఇది రైతులకు భారం గా మారిందన్నారు. ఎరువుల ధరల నిర్ణయం, సబ్సిడీ తదితర అంశాలను సంపూర్ణంగా తన ఆధీనంలో ఉంచుకొన్న కేంద్ర.. రైతులపై ఎరువుల భారం పడుతున్నా వాటిని తగ్గించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. రైతులు వినియోగించే 28:28:0 ఎరువు బస్తా ధర గత వానకాలంలో రూ.1,275 ఉండ గా, ఆరునెలల కాలంలో మూడుసార్లు పెరిగి ప్రస్తుతం రూ.1,900కు చేరిందన్నారు. పీఎంవో ధర గతంలో రూ.850 ఉండగా, ఇప్పుడు రూ.1,700కు చేరిందని చెప్పారు. 20:20: 0:13 ధర రూ.1,130 నుంచి రూ.1,300కు పెరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా రైతులు, మేధావులు ఉద్యమించాలని మంత్రి కొప్పుల పిలుపునిచ్చారు.