హైదరాబాద్ : తెలంగాణలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నాయకులు పగటి కలలు కంటున్నారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎన్ని జిమ్మిక్కులు చేసిన తెలంగాణ ప్రజలు విశ్వసించరని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని తెలిపారు. ఉమ్మడి పాలనలో సాగునీటి ప్రాజెక్ట్ లను నిర్లక్ష్యం చేసి తెలంగాణను ఎడారిగా మార్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఏనాడో తిరస్కరించారని, మళ్లీ ఏ మోహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని నిలదీశారు.
సీడబ్యూసీ సమావేశాలు పెట్టినా..ఎన్ని బహిరంగ సభలు పెట్టినా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో చోటే లేదని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ను చీరిచింతకు కట్టడం ఖాయమన్నారు. రోజుకో మాట మార్చే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఎలా నమ్మాలని ఎద్దేవా చేశారు. సోనియాను రేవంత్ రెడ్డి ఒకప్పుడు బలిదేవత అన్నారని.. ఇప్పుడేమో దేవత అంటున్నారని విమర్శించారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ సాధన కోసం ప్రాణ త్యాగానికి సైతం సిద్దపడ్డ నాయకుడు కేసీఆర్, అలాంటి కేసీఆర్ సారధ్యంలో తొమ్మిదేండ్లలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి – సంక్షేమ పథలకాల అమలులో దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. కర్నాటక తరహాలో తెలంగాణలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నాయకులు కలలు కంటున్నారని, ఆచరణ సాధ్యం కాని హామీలతో కర్నాటకలో గద్దెనెక్కిన కాంగ్రెస్..ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చే పరిస్థితి లేదని, కర్ణాటకలో పాలన గాడి తప్పిందని పేర్కొన్నారు.
6 గ్యారెంటీలు, డిక్లరేషన్లతో తెలంగాణలో విజయం సాధిస్తామని కాంగ్రెస్ నాయకులు భ్రమల్లో ఉన్నారని, అంతకంటే ఎన్నో రేట్లు మెరుగైన పథకాలు సీఎం కేసీఆర్ సారధ్యంలో అమలవుతున్నాయని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా అని నిలదీశారు.