Minister Harish Rao | పదో తరగతి పేపర్ లీకేజీకి పాల్పడి బండి సంజయ్, బీజేపీ పార్టీ అడ్డంగా దొరికిపోయిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. పేపర్ లీకేజీ వెనుక ఉన్న సూత్రధారి బీజేపీకి కరుడు కట్టిన కార్యకర్త, బండి సంజయ్‌కు ముఖ్య అనుచరుడు అని తెలిపారు. పేపర్ లీకేజీకి పాల్పడిన ప్రశాంత్ మీ పార్టీ కార్యకర్త కాకపోతే అతన్ని విడుదల చేయాలని ఎందుకు డిమాండ్ చేశారని బీజేపీని ప్రశ్నించారు.
‘ బీజేపీ నాయకులకు చదువు విలువ తెలియదు. బీజేపీలో చదువుకున్నోళ్లు తక్కువ ఉన్నారు. రాష్ట్రం నుంచి కేంద్రం దాకా అంతా ఫేక్ సర్టిఫికెట్లే వీళ్లవి. ఈ పేపర్ లీకేజీ వెనుక సూత్రధారి, పాత్రధారి అంతా ప్రత్యక్షంగా, పరోక్షంగా బండి సంజయ్ ఉన్నాడు. బండి సంజయే కుట్ర చేసిండు. బండి సంజయ్ మొన్న తాండూరులో జరిగిన పేపర్ లీకేజీలో అయిన.. వరంగల్ పేపర్ లీకేజీ వెనుక ఆయనే ఉన్నాడని అందరికీ అర్థమవుతంది. ఎందుకంటే తాండూరులో తెలుగు ప్రశ్నపత్రం లీకేజీ వెనుక ఉన్న ఉపాధ్యాయుడు బీజేపీ ఉపాధ్యాయ సంఘానికి చెందిన నాయకుడు. నిన్న అరెస్టయిన ప్రశాంత్.. బీజేపీలో కరుడుగట్టిన కార్యకర్త. బండి సంజయ్‌కు ముఖ్య అనుచరుడు. జాతీయ, రాష్ట్ర నాయకులతో ప్రశాంత్‌కు ప్రత్యక్ష సంబంధం ఉంది. సంజయ్ దీని వెనుక సూత్రధారి. ‘ అని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
పేపర్ లీకేజీ కాదు.. గతంలో కూడా బీజేపీ అనేక కుట్రలకు పన్నిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ‘ జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ఆత్మహత్య పేరుతో గందరగోళం సృష్టించి లబ్ధి పొందాలని చూసిండ్రు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని దెబ్బ తీయాలని చూసిండ్రు. ఈడీ, సీబీఐ, ఐటీ నోటీసులిచ్చి కుట్రలు పన్నిండ్రు. చివరకు ప్రశ్నపత్రాలు లీకేజీతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. దిగజారి కుట్రలతో పేపర్ లీకవుతుందని ప్రజల్లో గందరగోళం సృష్టించాలని దివాళా, దిక్కుమాలిన రాజకీయాలకు పాల్పడుతోంది. ‘ అని ఆరోపించారు.
పేపర్ లీకేజీ ఘటనపై మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న బీజేపీని మంత్రి హరీశ్ రావు నిలదీశారు. ఇందులో బీజేపీ తప్పు లేకపోతే తాను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని బండి సంజయ్‌ను డిమాండ్ చేశారు. ‘ నిన్న మధ్యాహ్నం ఏమో వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పద్మ, బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్.. పేపర్ లీకైందని ధర్నా చేసిండ్రు. సాయంత్రం ఏమో అరెస్టు చేసిన ప్రశాంత్‌ను వెంటనే విడుదల చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ధర్నా చేసిండ్రు. దీన్ని బట్టి ఎంత నగ్నంగా దొరికిపోయిండ్రు. అరెస్టయింది బీజేపీ కార్యకర్త కాకపోతే ఎందుకు ధర్నా చేసిండ్రు.’ అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. మంత్రి అడిగిన మరిన్ని ప్రశ్నలు..
☞ పదో తరగతి ప్రశ్నపత్రం వాట్సాప్ చేసిన ప్రశాంత్ బీజేపీ కార్యకర్త అవునా? కాదా? బండి సంజయ్ సమాధానం చెప్పాలి
☞ ప్రశాంత్ ప్రశ్నపత్రాన్ని బండి సంజయ్‌కు పంపింది నిజమా? కాదా?
☞ రెండు గంటల్లోనే 142 సార్లు ప్రశాంత్ ఫోన్లు మాట్లాడిండు. అందులో బండి సంజయ్‌కు ఫోన్ చేసింది నిజమా? కాదా?
☞ పనిగట్టుకుని ప్రశ్నపత్రాలను మీడియా గ్రూపులకు వెబ్సైట్లకు పంపించింది మీ ప్రోద్బలంతో అవునా? కాదా?
☞ ప్రశ్నపత్రం వ్యాప్తిలో మీ ప్రమేయం లేకపోతే నిందితుడు ఇచ్చిన సమాచారాన్ని ఎందుకు దాచారో సమాధానం చెప్పాలి?
☞ రోజుకో ప్రశ్నపత్రం లీకేజీ పేరుతో కుట్రలు పన్నింది నిజమా? కాదా?
☞ సోషల్ మీడియాలో ప్రశ్నపత్రాల లీకేజీ అంటూ ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా పోస్టులు పెట్టింది బీజేపీ కార్యకర్తలా? కాదా?
ప్రశ్నపత్రం పంపితే తప్పేంటి? అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు అంటున్నారు. ఎగ్జామ్ అయిపోయినంక పంపితే తప్పులేదు. కానీ ఎగ్జామ్ జరుగుతుండగానే ఎందుకు పంపిండు. నిందితుడు ప్రశాంతే బండి సంజయ్‌కు ఎందుకు పంపిండు. పేపర్ లీకేజీ సూత్రధారి అయిన ప్రశాంత్ పేపర్ పంపడాన్ని బట్టి మీ ఇద్దరూ పథకం ప్రకారం చేశారని బట్టబయలు అయినట్లే కదా ‘ అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నింఆచరు. ‘ పిల్లల జీవితాలతో బీజేపీ నాయకులు ఆడుకుంటున్నారు. నిస్సిగ్గుగా తప్పుడు చర్యలను సమర్థిస్తున్నారు. గుజరాత్లో 16 సార్లు పేపర్ లీకైతే నరేంద్ర మోదీ మాట్లాడడు. నడ్డా మాట్లాడడు. ఇక్కడ బీజేపీ నాయకులే కుట్రలు పన్నుతారు. ప్రశ్నపత్రాల లీకేజీ కాకపోయినా లీక్ అయ్యిందని ప్రచారం చేస్తారు. దానికి గల్లీ నుంచి ఢిల్లీ బీజేపీ దాకా ఖండిస్తారు. ధర్నా చేస్తారు. ఇదంతా బీజేపీ కుట్రలనే అని అన్నారు. పట్టపగలు నగ్నంగా బీజేపీ దొరికిపోయింది. పోలీసుల విచారణలో ప్రశాంత్ వాట్సాప్‌లో ఉన్న సందేశాలతో మొత్తం విషయం బయటకొచ్చింది.’ అని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రశాంత్ బీజేపీ కార్యకర్త కాకపోతే అతన్ని విడుదల చేయాలని ఎందుకు డిమాండ్ చేశారని ప్రశ్నించారు.
మీ డ్రామాలు కేసీఆర్ దగ్గర నడవవని బీజేపీని మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. అప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు అడ్డంగా దొరికిపోయారు. ఇవాళ ప్రశ్నపత్రాల లీకేజీలో కూడా అడ్డంగా దొరికిపోయారని అన్నారు. మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారుతారని ప్రజలకు అర్థమైందని తెలిపారు. మీ దివాళాకోరు రాజకీయాలు చూసి యావత్ తెలంగాణ సమాజం అసహ్యించుకుంటుందని అన్నారు.
పేపర్ లీకేజీకి సంబంధించి నిందితులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని పోలీసులకు మంత్రి హరీశ్ రావు సూచించారు. దీనిపై లోతైన విచారణ జరిపించాలని కోరారు. భవిష్యత్తులో కూడా పిల్లల జీవితాలతో ఆడుకోకుండా నిందితులు ఎంతటి వారైనా అందర్నీ కఠినంగా శిక్షించాలని పోలీసులకు సూచించారు. ఇలాంటి చర్యలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదని స్పష్టం చేశారు.