Minister Harish Rao | సీఎం కేసీఆర్ జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీ లక్ష్యం దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణలో 60 సంవత్సరాల్లో మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే.. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొమ్మిదేళ్లలో 21 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. తక్కువ సమయంలో 21 మెడికల్ కాలేజీలు ప్రారంభించి.. తెలంగాణ దేశంలోనే రికార్డు సృష్టించిందన్నారు. టీచింగ్ ఆసుపత్రులపై సోమవారం నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో హెల్త్ సెక్రెటరీ రిజ్వి, డీఎంఈ రమేశ్ రెడ్డి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేత మహంతి, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌలిక వసతులు ఏర్పాటు చేస్తూ, వైద్య సిబ్బందిని నియమిస్తూ ఆరోగ్య రంగాన్ని పటిష్టం చేసినట్లు పేర్కొన్నారు. ఇటీవల ఏక కాలంలో 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నియమించడంతో టీచింగ్ ఆసుపత్రులు మరింత బలోపేతమైనట్లు చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందేందుకు ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తమవంతు బాధ్యతగా సిబ్బంది పని చేయాలని సూచించారు. అందరు కలిసి పని చేస్తుండడంతో మంచి ఫలితాలు వస్తున్నాయన్న మంత్రి.. కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మాతృ మరణాలు రేటు భారీగా తగ్గిందన్నారు.
రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఈ మరణాల రేటు 92 ఉండగా.. ప్రస్తుతం 43 తగ్గించుకోగలిగామన్నారు. వైద్యారోగ్య రంగంలో రాష్ట్ర దేశంలో మూడో స్థానంలో ఉందని, ఇదంతా సిబ్బంది చేస్తున్న కృషికి నిదర్శనమేనన్నారు. ఇంతటితో సంతృప్తి చెండకూడదని, ఆరోగ్యరంగంలో తెలంగాణ నెంబర్ వన్‌గా నిలవాలన్నారు. మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ విద్యార్థులకు రోల్ మోడల్‌గా టీచింగ్ ఫ్యాక్టలీ ఉండాలని, క్రమశిక్షణగా ఉండేలా చూడాలన్నారు. ర్యాగింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు. కాలేజీలో ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలన్నారు. ఈ విషయంలో సహించేది లేదని హెచ్చరించారు. క్లినికల్ హాస్పిటల్ మేనేజ్మెంట్ డ్యూటీల విషయంలో సూపరింటెండెంట్లదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు.
రౌండ్ ద క్లాక్ సేవలు అందించాలని, అవసరం అయితే తప్ప రెఫర్ చేయకూడదని స్పష్టం చేశారు. స్పెషాలిటీ సేవలు జిల్లా పరిధిలోనే అందించాలనే మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎన్ఎంసీ నిబంధనలు ప్రకారం నడుచుకునేలా చూడాల్సిన బాధ్యత సూపరింటెండెంట్లపైనే ఉందన్నారు. తరగతులు, అనుమతుల విషయంలో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేసుకోవాలని ఆదేశించారు. స్టయిఫండ్ వేతనాలను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నామని, ఇటీవల 15శాతం పెంచినట్లు తెలిపారు.
బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ జరిగే దిశగా ప్రయత్నాలు చేయాలని, అవయవ దానాన్ని ప్రోత్సహించి.. ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు కృషి చేయాలన్నారు. ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, ఇన్ఫెక్షన్ కంట్రోల్ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ విషయంలో ఇప్పటికే శిక్షణ కూడా పూర్తి చేశామని, ప్రతి సోమవారం కమిటీ మానిటరింగ్ చేసుకోవాలన్నారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, ఉదయం 9 గంటల వరకు ప్రతి ఒక్కరూ విధుల్లో ఉండాలని ఆదేశించారు. కొత్తగా ఎంపికైన అసిస్టెంట్ ప్రొఫెసర్లు వైద్యంతో పాటు బోధన పరిశోధనపై దృష్టి సారించాలని సూచించారు.