యాసంగి వడ్ల కొనుగోళ్ల వ్యవహారంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు కలిసి చావు డప్పు మోగించారు. ఊరూరా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలకు శవయాత్రలు నిర్వహించి, దహనం చేశారు. మోదీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పలుచోట్ల యువకులు గుండు గీయించుకొన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా మహిళలు భారీగా కదిలివచ్చారు. రైతుబంధు సమితి బాధ్యులు ఆకుపచ్చ కండువాలు కప్పుకొని అన్ని గ్రామాల్లో నిరసన చేపట్టారు. పార్టీలకు అతీతంగా రైతులు వరి కల్లాల దగ్గర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
సిద్దిపేట, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన పూర్తి బాధ్యత కేంద్రానిదేనని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్‌రావు పేర్కొన్నారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుంచీ కేంద్ర ప్రభుత్వాలు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాయని, ఇప్పుడు ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయదని ప్రశ్నించారు. కేంద్రం తన బాధ్యత నుంచి తప్పుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన చావుడప్పు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైతులు బాగు పడాలంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గద్దె దిగాల్సిందేనని నిప్పులు చెరిగారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో నాటకాలాడుతున్న బీజేపీ నేతలను గ్రామాలకు వస్తే నిలదీయాలని రైతులకు పిలుపునిచ్చారు. ‘ప్రధాని మోదీ రైతులను దగా చేస్తుండు.. మంత్రి కిషన్‌రెడ్డి ఏదో మాట్లాడుతుండు.. బండి సంజయ్..! రైతుల మీద నీకు ప్రేమ ఉంటే ప్రధానిని ఒప్పించి, యాసంగిలో వడ్లు కొనిపించి మాట్లాడు. నీ సొల్లు పురాణం ఎవరూ వినరు. తెలంగాణలో పండేది..బాయిల్డ్ రైస్. ఇంతకాలం అమ్మింది అదే.. కేంద్రం కొన్నది అదే.. ఎందుకు కొనవో చెప్పు..’ అని మంత్రి హరీశ్‌రావు కేంద్రాన్ని నిలదీశారు. అబద్ధాలు, డొంక తిరుగుడు, సొల్లు మాటలు ఆపకపోతే బండి సంజయ్‌కు రైతుల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లు, సరఫరా, ఎగుమతులు ఇవన్నీ కేంద్రం బాధ్యతలేనని స్పష్టంచేశారు. కేంద్రం తన బాధ్యతలు నిర్వర్తించకుండా తెలంగాణలో పండిన ధాన్యాన్ని కొనబోమని మొండికేస్తున్నదని విమర్శించారు. రైతులతో పంటలు పండించే బాధ్యత రాష్ర్టాలదైతే, వాటిని కొనే బాధ్యత కేంద్రానిదేనని వివరించారు.
కాంగ్రెస్, జనతా, ఎన్డీఏ, యూపీఏ.. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ధాన్యం కొనుగోలు చేసిందని, మోదీ ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయదని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోతే, తెలంగాణ రైతులంతా నష్టపోయి, రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టుకోవాలన్నదే బీజేపీ పన్నాగమని హరీశ్‌రావు పేర్కొన్నారు. రైతులను ముంచి, కేసీఆర్ మీదకు ఎగదోయాలన్నదే వారి కుట్ర అని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని బంగారు పంటలు పండించేలా తీర్చిదిద్దారని హరీశ్‌రావు పేర్కొన్నారు. పంటలకు పెట్టుబడి, నీళ్లు, విద్యుత్తు ఇచ్చి రైతులను ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని చెప్పారు.
పరామర్శలతో నాటకాలాడుతున్న కాంగ్రెస్ లీడర్లు
తమ హయాంలో రైతులు చనిపోతే ఎక్స్‌గ్రేషియా ఇవ్వని కాంగ్రెస్ నాయకులు నేడు పరామర్శల పేరుతో నాటకాలు ఆడుతున్నారని మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు. రాష్ట్రంలో 67,669 మంది రైతులు చనిపోతే ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున రైతుబీమా అందజేసి, ఆయా కుటుంబాలను ఆదుకున్నామని వివరించారు. దేశంలో ఎక్కడైనా ఇలాంటి పరిస్థితి ఉన్నదా? అని ప్రశ్నించారు. ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతులు బాగుపడుతుంటే, బీజేపీ నాయకులు ఓర్వలేక పోతున్నారని విమర్శంచారు. రైతులు ఆగం కావద్దన్నదే తమ తండ్లాట తప్ప బీజేపీ వాళ్లు వడ్లు కొంటమంటే వద్దంటమా? అని ప్రశ్నించారు. బీజేపీ మోసాన్ని ఊరూరా రైతులకు తెలియజేయాలని పిలుపునిచ్చారు.
కిషన్‌రెడ్డికి రైతులమీద ప్రేమ ఉంటే ప్రధానిని ఒప్పించాలి
కేంద్రమంతి కిషన్‌రెడ్డికి రైతుల మీద ప్రేమ ఉంటే ప్రధానిని ఒప్పించి, యాసంగి ధాన్యం కొనుగోలు చేయించాలని మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. గత యాసంగి ధాన్యం కేంద్రం ఇప్పటివరకు ఎందుకు కొనలేదో చెప్పాలని నిలదీశారు. ఇంకా ఏ ముఖం పెట్టుకుని బీజేపీ నేతలు తిరుగుతున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవాచేశారు. గ్రామాల్లోకి బీజేపీ నాటకాల రాయుళ్లు వస్తే తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ‘ఉన్నవడ్లు కొనమని ఎగబెట్టారు. ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపారు. లోయర్ సీలేరు పవర్‌ప్లాంట్‌ను గుంజుకున్నారు.
సింగరేణి బొగ్గుగనిని ప్రైవేటు పరం చేస్తున్నారే తప్ప తెలంగాణ రాష్ర్టానికి మేలు చేసిందేమీ లేద’ంటూ కేంద్రంలోని బీజేపీ తీరును హరీశ్‌రావు దుయ్యబట్టారు. బీజేపీ కార్పొరేట్ కంపెనీలకు, బడాబడా వ్యాపారులకు కొమ్ముకాస్తున్నదని విమర్శించారు. లక్షల కోట్ల రుణాలను ఎగవేసిన వారికి మాఫీ చేసిందని గుర్తుచేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలేదని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి రైతులను దూరం చేయాలని, చిచ్చు పెట్టాలని కేంద్రం ప్రయత్నిస్తున్నదని, ఈ కుట్రలను తిప్పికొట్టాలని కోరారు.
ప్రధాని మోదీ రైతులను దగా చేస్తుండు.. కిషన్‌రెడ్డి ఏదో మాట్లాడుతుండు.. బండి సంజయ్ తొండి చేస్తుండు. నీకు రైతుల మీద ప్రేమ ఉంటే ప్రధానిని ఒప్పించి, యాసంగిలో వడ్లు కొనిపించి మాట్లాడు. నీ సొల్లు పురాణం ఎవరూ వినరు. తెలంగాణలో పండేది.. బాయిల్డ్ రైస్. ఇంత కాలం అమ్మింది అదే.. కేంద్రం కొన్నదీ అదే.. ఇప్పుడెందుకు కొనవో చెప్పు..ఎరువుల ధర పెంచారు. బాయిలకాడ మీటర్లు పెడతామంటారు. జీఎస్టీ మల్ల. ఇలా చేస్తే రైతులు బాగుపడతరా..? రైతులు బాగుపడాలంటే బీజేపీ గద్దె దిగాల్సిందే. అందుకు పోరాటం చేద్దాం.
రైతుల కోసం రూ.3 లక్షల కోట్లు
వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తున్నది కేసీఆర్.. ఎకరాకు రూ.10 వేల చొప్పున రైతుబంధు ఇస్తున్నది కేసీఆర్. రైతులకు సాగునీరు అందించి, బంగారు పంటలు పండించేలా చేస్తున్న ఘనత కేసీఆర్‌దే. కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేండ్లలో పూర్తి చేసిన ఘనత కేసీఆర్‌ది కాదా? రైతుబంధు పథకం కింద రూ.50 వేల కోట్లు ఇచ్చింది కేసీఆర్. ఉచిత విద్యుత్తు కోసం విద్యుత్తు శాఖకు రూ.45వేల కోట్లు ఇచ్చింది కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్షన్నర కోట్లు ఇచ్చింది కేసీఆర్. ఇలా వివిధ పథకాల ద్వారా రైతుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.3 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది.
-మంత్రి హరీశ్‌రావు
ఎన్నికలున్న రాష్ర్టాల్లో తప్ప ఇక్కడ కొనరా?
త్వరలో ఎన్నికలు జరుగనున్న రాష్ర్టాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు సేకరించడం లేదు. బీజేపీ సర్కారు ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలి. తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయొద్దు. వడ్ల కొనుగోళ్లపై ఢిల్లీకి పోయిన రాష్ట్ర మంత్రులను కలిసేందుకు కేంద్ర మంత్రులు సుముఖత చూపడం లేదు. రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే. రాష్ట్ర బీజేపీ నాయకుల మాటలు నమ్మితే రైతులు నష్టపోతారు.
-నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
పంజాబ్‌లో కొని ఇక్కడెందుకు కొనరు?
ధాన్యం కొనే వరకూ కేంద్రంపై యుద్ధం చేస్తాం. పంజాబ్ నుంచి రెండు సీజన్ల పంటలనూ కొనుగోలు చేస్తున్న కేంద్రం.. తెలంగాణ ధాన్యాన్ని ఎందుకు కొనడం లేదో సమాధానం చెప్పాలి. తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. పారాబాయిల్డ్ రైస్‌కు రూపకల్పన చేసిన ఎఫ్‌సీఐ.. ఇప్పుడు కొనబోమని తెలివిగా తప్పించుకొంటున్నది. రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించిన చరిత్ర లేదన్న విషయాన్ని బీజేపీ గుర్తించాలి. తెలంగాణ రైతులకు ఇంత అన్యాయం జరుగుతుంటే కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ తన బాధ్యతను విస్మరించింది.
-ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్