మణికొండ, దుబ్బాక, నవంబర్ 26: గత కాంగ్రెస్ పాలనలో నిత్యం కరెంటు కోతలు ఉండేవని, ప్రతి దుకాణం ముందు చూసినా జనరేటర్లే కనిపించేవని, ఆ పార్టీకి ఓటేస్తే మళ్లీ ఆ పరిస్థితే వస్తుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలిత కర్ణాటక నిత్యం కరెంటు కోతలతో సతమతమవుతున్నదని చెప్పారు. కానీ, కేసీఆర్ 24 గంటల కరెంట్, ఉచిత నీళ్లు ఇచ్చారని తెలిపారు. ఆదివారం రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండ, దుబ్బాకలో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పాలొన్న హరీశ్ మాట్లాడుతూ.. కేసీఆర్ నేతృత్వంలో హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని వెల్లడించారు. గతంలో మంచినీళ్లకు ఇబ్బంది పడేవారని, అపార్ట్మెంట్లలో ఉండేవాళ్లు డబ్బులిచ్చి నీళ్ల ట్యాంకర్లను తెచ్చుకొనే దుస్థితి ఉండేదని గుర్తుచేశారు. జలమండలి దగ్గర ధర్నాలు చేసేవాళ్లని అన్నారు. కానీ రాష్ట్రం వచ్చాక నల్లాబిల్లు మాఫీ చేసిన ఘనత కేసీఆర్‌దేనని వివరించారు. నీళ్ల కష్టం తీర్చిన నాయకుడు కేసీఆర్ అని గుర్తు పెట్టుకోవాలని మహిళలను కోరారు.
కర్ణాటక మాడల్ అంటే కరెంటు కోతలా?
కర్ణాటక మాడల్ అంటూ కాంగ్రెసోళ్లు ఊదరగొడుతున్నారని, అంటే తెలంగాణలో కరెంటు కోతలు పెడతారా? మంచినీళ్లు కట్ చేస్తారా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. బెంగళూరులో రోడ్లు బాగోలేక ట్రాఫిక్ విపరీతంగా పెరిగిందని విమర్శించారు. ఆ పార్టీకి ఓటేస్తే రియల్ ఎస్టేట్ కుప్పకూలుతుందని హెచ్చరించారు. బెంగళూరులో గజానికి రూ.80 లంచం ఇస్తేనే పర్మిషన్ వస్తుందని, ఆ పరిస్థితి హైదరాబాద్‌కు తెచ్చుకుందామా? అని ప్రజలను అడిగారు. రాహుల్‌గాంధీకి దమ్ముంటే బెంగళూరులో నిరుద్యోగులతో మీటింగ్ పెట్టగలరా? అని ప్రశ్నించారు. గత కాంగ్రెస్ పాలనలో ఇసుక ఆదాయం రూ.5 కోట్లు మాత్రమే వచ్చిందని, కేసీఆర్ వచ్చాక అది రూ.5 వేల కోట్లకు చేరిందని వివరించారు. హస్తం పార్టీ పాలనలో డబ్బంతా వారి జేబుల్లోకే వెళ్లిందని, కేసీఆర్ పాలనలో సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు చేరిందని తెలిపారు.
కాంగ్రెస్‌ది గతి, సుతిలేని సంసారమని, ఆ పార్టీని నమ్మి మోసపోవద్దని ప్రజలకు హితవు చెప్పారు. ‘రిస్క్ వద్దు.. కారుకే ఓటు గుద్దు’ అని పిలుపునిచ్చారు. తెలంగాణ వచ్చాక హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య తీర్చామని తెలిపారు. సీసీకెమెరాలతో, ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో శాంతిభద్రతలు కాపాడుకుంటున్నామని వివరించారు. కన్న కొడుకులు పట్టించుకోకపోయినా తాను ఉన్నానన్న భరోసా కేసీఆర్ కల్పించారని స్పష్టం చేశారు. మూడోసారి గెలిచాక మూడు కొత్త వరాలు వస్తున్నాయని, సౌభాగ్యలక్ష్మి, రూ.400 గ్యాస్ సిలిండర్, సన్న బియ్యం వంటి పథకాలు రాబోతున్నాయని చెప్పారు. రైతుబంధు పడుతుందంటే కాంగ్రెస్ గుండెలు జారుతున్నాయని, సంపద పెంచి పేదలకు పంచటమే కేసీఆర్ విధానమని పేర్కొన్నారు. 11 సార్లు చాన్స్ ఇస్తే కనీసం మంచినీళ్లు ఇవ్వలేని పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. కటక వేస్తే వచ్చే కరెంట్ కావాల్నా? కటిక చీకటి కర్ణాటక తరహా కరెంట్ కావాల్నా? అన్నది ప్రజలు ఆలోచించాలని కోరారు.
హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటూ రాదు
హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాదని మంత్రి హరీశ్ అన్నారు. మూడు సార్లు గెలిచిన ప్రకాశ్‌గౌడ్ సాదాసీదాగా ఉంటారని, గర్వం అనేదే ఉండదని చెప్పారు. ఆయనను మళ్లీ గెలిపిస్తే మణికొండకు 100 పడకల దవాఖాన మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. బీజేపీతో కోట్లాడే సామర్థ్యం బీఆర్ఎస్కే ఉన్నదని స్పష్టం చేశారు. ఆటోల ఫిట్నెస్ చార్జీలు రద్దు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ మాట్లాడుతూ పదేండ్లలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని వెల్లడించారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దని, ఆలోచించి కారు గుర్తుకే ఓటువేయాలని అభ్యర్థించారు. మణికొండ సభలో మణికొండ మున్సిపల్ బీఆర్ఎస్ సమన్వయకర్త తలారి మల్లేశ్ ముదిరాజ్, ఫ్లోర్‌లీడర్ రామకృష్ణారెడ్డి, నార్సింగి మున్సిపల్ చైర్పర్సన్ రేఖయాదగిరి, శంషాబాద్ జడ్పీటీసీ తన్విరాజు, వైస్‌చైర్మన్ వెంకటేశ్‌యాదవ్, బండ్లగూడ మున్సిపల్ మేయర్ మహేందర్‌గౌడ్, డిప్యూటీ మేయర్ రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ పాలనలో గ్రామాల్లో కరువు లేదు. హైదరాబాద్‌లో కర్ప్యూ లేదు. కాంగ్రెస్‌కు ఓటేస్తే కరువు, కర్ఫ్యూ రెండూ వస్తాయి.
ప్రతిపక్షాల అధిష్ఠానం ఢిల్లీలోనే ఉంటుంది. ఇప్పుడు అక్కడి కాలుష్యం తెలంగాణకు చేరింది. మూడు రోజులు భరిస్తే ఆ శబ్ద కాలుష్యం మళ్లీ ఢిల్లీకే పోతుంది. లోకల్‌గా ప్రజల కోసం ఉండేది కేసీఆరే. కారు గుర్తుకు ఓటేసి హ్యాట్రిక్ సీఎంను చేసుకుందాం.
– మంత్రి హరీశ్‌రావు