హుజూరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్ ఊరూరా తిరుగుతూ టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాల వల్ల కలిగిన ప్రయోజనాలను ప్రజల కళ్లకుకడుతున్నారు. హుజూరాబాద్ నగరంలోని 25 వ వార్డు సూపర్బజార్లో మంత్రి గంగుల కమలాకర్ ఆదివారం వినూత్న ప్రచారం నిర్వహించారు. ఆ వార్డులోని ఓ లాండ్రీ షాపులో బట్టలు ఇస్త్రీ చేశారు. అక్కడున్నవారిని ఆప్యాయంగా పలుకరించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. రజకులు, నాయీబ్రాహ్మణులు ఆర్థికంగా ఇబ్బంది పడొద్దని లాండ్రీ, సెలూన్ షాపులకు 250 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ సర్కారేనని స్పష్టం చేశారు. సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని చెప్పారు. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి గంగుల ప్రజలను కోరారు.