హుజూరాబాద్: బీజేపీకి ఓటమి భయం పట్టుకున్నదని, అందుకే సీఎం కేసీఆర్ సభ పెడతానంటే ఈసీ సహాయంతో అడ్డుకుంటున్నదని మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. హుజూరాబాద్‌లోని 22వ వార్డు, అంబేద్కర్ ప్రధాన చౌరస్తాలో మంత్రి గంగుల కమలాకర్ శనివారం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ అసమగ్ర విధానాల వల్ల దేశం తీవ్రంగా నష్టపోతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. పెట్రో, గ్యాస్ ధరలు పెంచుతూ బీజేపీ సర్కారు సామాన్యుడి నడ్డి విరుస్తున్నదని మండిపడ్డారు. ప్రైవేటీకరణ పేరుతో బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నదన్నారు. ఆదినుంచీ కేంద్ర సర్కారు తెలంగాణపై చిన్నచూపు చూస్తున్నదని మండిపడ్డారు.
హుజూరాబాద్‌కు వస్తున్న బీజేపీ నాయకులుగానీ, ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్గానీ అభివృద్ధిపై మాట్లాడకుండా అబద్ధాలతో జనాల్ని మోసం చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ విరుచుకుపడ్డారు. అన్నింట్లో తమ వాటా ఉందని చెప్పే బీజేపీ నాయకులు.. మరి దళితబంధులోకూడా వాటా ఇస్తారా? అని ప్రశ్నించారు. దళిత కుటుంబాలు అభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్ దళితబంధు కింద రూ. 10 లక్షలు ఇస్తుంటే..బీజేపీ నాయకులు మరో రూ. 10 లక్షలు ఇవ్వాల్సిందిపోయి ఎలక్షన్ పేరుతో అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ అన్నదాతల కోసం 24 గంటల నాణ్యమైన కరెంట్ ఉచితంగా ఇస్తుంటే.. బీజేపీ సర్కారు మోటార్లకు మీటర్లు పెట్టాలని నిర్ణయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇలా అయితే రైతుల పరిస్థితి మొదటికొస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజలు, రైతులే బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ నెల 30న జరుగబోయే ఎన్నికల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మంత్రి గంగుల కమలాకర్ వెంట స్థానిక నేతలు, డాక్టర్లు, తదితరులున్నారు.