సారపాక, మార్చి 13: ఓ చిన్నారి వైద్యానికి ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ చేయూతనందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం పారిశ్రామిక ప్రాంతమైన సారపాకలోని ఒడియా క్యాంప్‌నకు చెందిన రవి-పద్మ దంపతుల ఆరు నెలల బాబు పుట్టుకతోనే వంకర కాళ్లతో జన్మించాడు. రవి ఇటీవల మృతిచెందాడు. దీంతో ఆ చిన్నారి ఆరోగ్యపరిస్థితిపై స్థానికులు ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌ను గమనించిన మంత్రి కేటీఆర్.. చిన్నారి వైద్యానికి సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. మంత్రి ఆదేశాల మేరకు ఆయన కార్యాలయ సిబ్బంది.. బాధిత చిన్నారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకొన్నారు. సత్వరమే శస్త్రచికిత్స జరిగేలా చూస్తామని, జిల్లా వైద్యాధికారులు వచ్చి కలుస్తారని తెలుపడంతో బాధిత కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.