వనపర్తి, మే 7(నమస్తే తెలంగాణ) : అడుగడుగునా కొర్రీలు, అధికారుల ఉదాసీనత వెరసి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు అనుకున్న స్థాయిలో ముందుకు సాగడం లేదు. ఫలితంగా రైతులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. రైతుల నుంచి పెరగుతున్న ఒత్తిడిలతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సైతం ఇరకాటంలో పడుతున్నారు. ఈ క్రమంలో అన్నదాతలు ప్రభుత్వ కార్యాల యాలు, ప్రధాన రోడ్లపై ఆందోళనలకు దిగుతుండటంతో తీవ్రత పెరుగుతున్నది. జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో యాసంగిలో వరి సాగైంది. ఈ మేరకు 3.50 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరించాలన్న లక్ష్యం ఉన్నది. వీటిలో సన్నరకం 2.10 లక్షల మెట్రిక్ టన్నులు, దొడ్డురకం, 1.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా ఉన్నది. ఈ క్రమంలో ఇప్పటి వరకు 10 వేల మెట్రిక్ టన్నులు కూడా కొనుగోళ్లు జరగలేదంటే ప్రక్రియ ఎలా ఉందో అర్థమవుతుంది.
ముందు నుంచి జాప్యమే…
ఏప్రిల్ నెలలో షురూ అయిన ధాన్యం కొనుగోళ్లు ముందుకు సాగడమే లేదు. ముందు నుంచి మిల్లర్లు తాలు పేరుతో కిరికిరి పెడుతూనే ఉన్నారు. అధికారులు రైతులను ఇబ్బంది పెట్టవద్దని చెప్పినా వారు పెడచెవిన పెడుతున్నారు. ఐకేపీ, మెప్మా, పీఏసీసీఎస్ల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని దించుకోవడం లేదు. రైతులే స్వయంగా మిల్లుల వద్దకు వెళ్లి కోతలకు ఒప్పుకుంటేనే ఆ ధాన్యాన్ని దించుకుంటామంటున్నారు. దీంతో లారీలు రోజుల తరబడి అక్క డే ఉండాల్సి వస్తున్నది. వెళ్లిన లారీలు దించరు.. కొత్త లారీలు కేంద్రాలకు రావు. ఇలా కొనుగోళ్ల ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా నత్తనడకన సాగుతున్నది.
ఇప్పటి వరకు కొన్నది 14 వేల టన్నులే..
జిల్లాలో ఇప్పటి వరకు 14 వేల టన్నులు మాత్ర మే కొనుగోలు చేసినట్లు అంచనా ఉంది. అయితే, వీటిలో సగానికి తక్కువ సంచులే కేంద్రాల నుంచి తరలించారు. మిగిలిన బస్తాలు పది రోజులై నా కదలడం లేదు. మిల్లర్లు ముందుకు రాకపోవడం, తరుగు తీస్తామని కొర్రీలు పెట్టడంతో తరలింపు ప్రక్రియ గాడిన పటడం లేదు. కొనుగోలు వ్యవస్థలో ఒకరిపై ఒకరు చెప్పుకుంటు పోవడం తప్పా సమస్య కొలిక్కి రావడం లేదు. ప్రధానంగా మిల్లర్లు ధాన్యం దించుకునేందుకు సుముఖత చూపకపోవడంతోనే జఠిలమవుతున్నది. అధికారుల ముందు భారీ స్థాయిలో కొనుగోళ్ల లక్ష్యం ఉండగా, ఏ మాత్రం సాఫీగా జరగడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నది.
మిల్లర్లదే పైచేయి..
జిల్లాలో మిల్లర్లదే పైచేయిగా నడుస్తుంది. నెల రోజుల నుంచి బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వాలని చెప్పి నా అనుకున్న స్థాయిలో ముందుకు రావడం లేదు. ధాన్యం దింపుకోవాలన్నా ససేమిరా అంటున్నారు. ఆ వెళ్లిన ధాన్యం లారీలను సహితం మూడు, నాలు గు రోజులు నిలిపి రైతులను సతాయించి దింపుకుంటున్నారు. కొనుగోళ్లు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వ్యవస్థ గాడిన పడనేలేదు. ఇదిలా ఉంటే.. అధికారుల పర్యటనలకు కొదవేం లేదు. ఒక పక్క కలెక్టర్, మరోపక్క అదనపు కలెక్టర్ (రెవెన్యూ)లు విరామం లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షిస్తూనే ఉన్నారు. అయినా కొనుగోళ్ల ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన సాగుతుంది. వెరసీ జిల్లాలో అధికారులపై రైస్ మిల్లర్లదే పైచేయి అన్నట్లు అగుపిస్తున్నది.
నాణ్యతలేని ధాన్యమైతే..?
ధాన్యం అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. కల్లాల వద్ద 42 కేజీలు తూకం వేసి లారీలకు ఎత్తి మిల్లులకు పంపిస్తున్నారు. తీరా అక్కడికి వెళ్లిన అనంతరం తాలు ఉందంటూ మిల్లర్లు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రోజుల తరబడి ధా న్యం దించక పోవడంతో సమస్య పెరుగుతున్నది. ఇప్పటికే కోతలు కోసి నెల రోజులు దాటింది. తీవ్రమైన ఎండలకు వడ్లు ఒకటి, రెండు రోజుల్లోనే మా యిశ్చర్ వస్తున్నాయి. దీని అనంతరమే ధాన్యాన్ని చెక్ చేసి నిబంధనల ప్రకారం ఉంటేనే కొనుగోలు చేసి మిల్లులకు పంపిస్తారు. ఈ ప్రక్రియలో వెళ్లిన ధాన్యానికి కూడా మిల్లర్లు అదనపు కోతలు పెడుతూ రైతులతో ఆడుకుంటున్నా.. ఎవరూ కిమ్మనడం లేదు. 12 ఏళ్లుగా జరుగుతున్న ధాన్యం కొనుగోళ్ల వ్యవస్థలో ఇంతటి దారుణ పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని రైతన్నలు బావురుమంటున్నారు. నిజంగా నాణ్యత లేదా.. ఒకవేళ లేకుంటే నాణ్యతలేని ధాన్యంను ఎందుకు తూకం వేసి పంపిస్తున్నారు.. లేదా మిల్లర్ల దగ్గరే ఏదైనా తంతు జరుగుతుందా అన్న ధర్మ సందేహాలకు ఎవరి నుంచి సమాధానాలు లేవు.
మిల్లుల సంఖ్య పెంచాం..
ఇటీవలి వరకు 30 మి ల్లులకు మాత్రమే ధా న్యం కేటాయింపులు జరిగా యి. ప్రస్తుతం మరో 18 మిల్లులకు ధాన్యం కేటాయించడం జరిగింది. ఇ ప్పుడు ప్రక్రియ గతం కంటే మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉన్నది. హార్వెస్టర్ యజమానులు డీజిల్ సేవ్ చేసుకోవడం కోసం తాలు రాకుండా చూడనందునా సమస్య వస్తున్నది. సరిపడా ప్యాడీ క్లీనర్స్ కూడా లేవు. ఎండలకు రైతులు తూర్పారబట్టే పరిస్థితి కూడా అంతంత మాత్రమే. తాలు సమస్య లేకుంటే పని సజావుగా జరుగుతుంది. జిల్లాలో ఇప్ప టి వరకు 14 వేల టన్నులు కొన్నాం. కొనుగోళ్లలో మరింత వేగంగా జరిపేందుకు ప్రయత్నిస్తున్నాం.
– కాశీవిశ్వనాథ్, డీఎస్వో, వనపర్తి జిల్లా