హైదరాబాద్, ఫిబ్రవరి 13(నమస్తే తెలంగాణ ) : అంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్..తాజాగా హైదరాబాద్‌లో నూతన క్యాంపస్‌ను ప్రారంభించింది. గచ్చిబౌలిలో 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ అధునాతన భవనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఈ క్యాంపస్‌తో 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్(ఐడీసీ) మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ…తెలంగాణలో తమ పెట్టుబడుల కమిట్మెంట్కు ఈ నూతన క్యాంపస్ నిదర్శణమని, భవిష్యత్తులో మరో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా ఉందన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో 1.2 లక్షల మందికి పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) శిక్షణను అందించేందుకు మూడు కొత్త ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. అడ్వాంటా(ఐ) జీఈ తెలంగాణ ప్రోగ్రామ్ పేరుతో మైక్రోసాఫ్ట్ 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ కోర్సును పరిచయం చేసేందుకు ఏఐ ఫౌండేషన్స్ అకాడమీని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దీంతో దాదాపు 50 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనున్నదన్నారు. ఏఐ-ఇండస్ట్రీ ప్రో పేరుతో మరో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్రమంతటా 20,000 మంది నిపుణులకు శిక్షణ ఇవ్వనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని స్థాపించబోతున్నది. ఇందులో ఏఐ నాలెడ్జ్ హబ్‌తో పాటు ఏఐ క్లౌడ్-ఆధారిత సేవలు అందించనున్నారు. రాష్ట్రంలో వేలాది మంది ఉద్యోగులకు ఉపయోగపడేలా రీసర్చ్, కేస్ స్టడీస్, ఉత్తమ పరిశోధన పద్ధతులు ఈ సెంటర్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఏఐ అభివృద్ధితో పాటు రాష్ట్రంలో హైపర్ సేల్ ఏఐ డాటా సెంటర్లలో తన పెట్టుబడులను రెట్టింపు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌కు అతిపెద్ద డాటా హబ్‌గా అవతరించనుంది. ఈ ప్రణాళికలకు సంబంధించి కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని ఉపయోగించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ సెర్చింజన్ గూగుల్‌తో ఎంఓయూ కుదుర్చుకున్నది. ప్రధానంగా వ్యవసాయం, పరిపాలన, రవాణా, విద్య తదితర కీలక రంగాల్లో ఏఐ ఆధారిత సేవలు, పరిషారాలు అమలు చేయాలని లక్ష్యంగా ఎంచుకున్నది. ఇక ఈ ఒప్పందంలో భాగంగా భవిష్యత్తు అవసరాలకు తగినవిధంగా డిజిటల్ నైపుణ్యాలతో శ్రామిక శక్తిని సన్నద్ధం చేసేందుకు గూగుల్ వ్యూహాత్మక సహకారం అందించనున్నది.