Bahrain | ఎన్నో ఆశలతో బతుకుదెరువు కోసం బహ్రెయిన్ (బేరాన్)కు వెళ్లిన ఓ యువకుడిని విధి కాటేసింది. ఐదేండ్ల కిందట తనువు చాలించిన ఆ వలసజీవి మృతదేహాన్ని గుర్తించేవారు లేక దిక్కూమొక్కూలేని అనాథ శవంలా మార్చురీ గదిలో మగ్గుతున్నది. చివరకు ఆ దేశంలోని భారత ఎంబసీ అధికారుల దృష్టికి వెళ్లడంతో పాస్‌పోర్టు ఆధారంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన శ్రీపాద నరేశ్‌గా గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మెట్పల్లి పట్టణంలోని రాంనగర్ లో నివాసం ఉంటున్న ధర్మపురి భారతి, అశోక్ దంపతులకు ఇద్దరు కొడుకులు ఆనంద్, నరేశ్. భర్త చనిపోవడంతో ఇద్దరిని పెంచలేక భారతి.. తన రెండో కొడుకు నరేశ్‌ను తన సోదరి శ్రీపాద లక్ష్మీకి దత్తత ఇచ్చింది. 2008లో నరేశ్‌కు కథలాపూర్ మండలం కలిగోటకు చెందిన లతతో వివాహం జరిగింది. కొన్ని నెలల తర్వాత జీవనోపాధి కోసం నరేశ్ బహ్రెయిన్ వెళ్లాడు. అక్కడే ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. 2010లో సెలవులపై వచ్చిన నరేశ్ రెండు నెలల తర్వాత మళ్లీ బహ్రెయిన్ వెళ్లాడు. మొదట భవన కార్మికుడిగా పనిచేసిన నరేశ్.. ఆ తర్వాత ఓ కంపెనీలో మెకానిక్‌గా చేరాడు. కొంతకాలం తర్వాత అక్కడ కూడా పని మానేశాడని సమాచారం. చివరగా 2018లో పాస్‌పోర్టు గడువు ముగుస్తోందని.. డబ్బులు పంపించాలని కుటుంబసభ్యులకు కాల్ చేశాడు. ఆ తర్వాత నుంచి నరేశ్ నుంచి ఎలాంటి సమాచారం లేకుండా పోయింది. అప్పట్నుంచి నరేశ్ ఆచూకీ కోసం కుటుంబసభ్యులు ఎదురుచూస్తూ ఉన్నారు.
కాలక్రమేణా నరేశ్ తల్లి, దత్తత తీసుకున్న తల్లిదండ్రులు మరణించారు. దీంతో అతని భార్య లత ఒక్కతే భర్త ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తోంది. గతంలో ఆమె పోలీసులను కూడా ఆశ్రయించింది. సుఖీభవ స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ నాగరాజు సాయంతో నరేశ్ సోదరుడు ధర్మపురి ఆనంద్ కూడా భారత రాయభార కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అయితే నరేశ్ ఇంటిపేరును శ్రీపాదకు బదులుగా ధర్మపురి అని పేర్కొనడంతో ఇంతకాలం సమాచారం తెలియరాలేదు. ఇక నరేశ్ మాత్రం 2020 మే నెలలోనే మృతి చెందాడు. అతని కుటుంబసభ్యుల వివరాలు తెలియరాకపోవడంతో విషయాన్ని తెలియజేయలేకపోయారు. దీంతో మృతదేహాన్ని అక్కడే మార్చురీలో భద్రపరిచారు. ఇటీవల మృతుని వివరాలను అధికారులు సోషల్‌మీడియాలో పెట్టడంతో రెండు వారాల కిందట నరేశ్ కుటుంబసభ్యులకు తెలిసింది. నరేశ్ మృతదేహాన్ని త్వరగా ఇండియాకు రప్పించాలని అతని సోదరుడు హైదరాబాద్‌లోని సీఎం ప్రవాసి ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు.