సిటీబ్యూరో, అక్టోబరు 21 (నమస్తే తెలంగాణ ) ః జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో కీలకమైన నామినేషన్ల ఘట్టం మంగళవారంతో ముగిసింది…ప్రదాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు, నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వంపై వ్యతిరేక వర్గాలు భారీ సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలు ముగియడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని దృష్టి సారించాయి.
ఈ మేరకు పార్టీల తరపున స్టార్ క్యాంపెయినర్లకు రంగంలోకి దింపారు. ఎన్నికలకు మరో 21 రోజుల సమయం మిగిలి ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రజాక్షేత్రంలో ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు.. గల్లీలు, కాలనీల్లో ర్యాలీలు, సభలు, సమావేశాలు, పాదయాత్రలతో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు హోరాహోరీ ప్రచారం చేపడుతున్నారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ ప్రచారంలో అన్ని పార్టీల కంటే దూసుకుపోతున్నది. రెండు జాతీయ పార్టీల అభ్యర్థులు ఆయా పార్టీల నేతల మధ్య అంతర్గత పోరుతో సతమతమవుతుండంగా, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్‌కు మద్ధతుగా పార్టీ రాష్ట్ర కార్యవర్గం, ప్రజాప్రతినిధులు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వినూత్నంగా నిర్వహిస్తూ ఓటర్లకు దగ్గరయ్యారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్‌ను భారీ మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, శ్రేణులు ప్రత్యేక వ్యూహాలతో ప్రచార పర్వాన్ని సాగిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పటికే నియోజకవర్గంలో డివిజన్ల వారీగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విస్తృత స్థాయి, బూత్ లెవల్లో సమావేశాలు నిర్వహించారు. డివిజన్ల వారీగా మాజీ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాగంటి సునీత గోపినాథ్‌కు మద్ధతుగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండడం, ప్రజలు అడుగడుగునా నీరాజనం పడుతున్నారు. వెంగళ్రావు నగర్ డివిజన్లో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వినూత్నంగా ప్రచారం చేపట్టారు.
బీఆర్ఎస్ హయాంలో నగరానికి నలువైపులా టిమ్స్ దవాఖానాల నిర్మాణం చేపట్టగా..జూబ్లీహిల్స్ నియోజకర్గ పరిధిలో టిమ్స్ నిర్మాణం తుది దశకు చేరుకున్నది. ఈ టిమ్స్ బీఆర్ఎస్ ఘనతే అంటూ ఆ ప్రాంతాన్ని సందర్శించి ప్రజల్లో బీఆర్ఎస్కు అభివృద్ధిని వివరించారు.దీంతో పాటు రహ్మత్ నగర్ డివిజన్లో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అంబేద్కర్ దళిత్ స్టడీ భవనాన్ని సందర్శించారు. మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్లు బస్తీ దవాఖానాలను సందర్శించి బీఆర్ఎస్ హయాంలో నిర్వహణ ఎలా ఉండే? రెండేళ్లలో బస్తీ దవాఖానా సేవలు ఏ స్థాయికి దిగజార్చిందో ప్రజలకు వివరిస్తూ ఆకట్టుకుంటున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ నేతల ప్రచారానికి అనూహ్య స్పందన లభిస్తున్నది.
ప్రతి ఒక్కరినీ అప్యాయంగా పలకరిస్తూ..ఓటు అభ్యర్ధిస్తూ ముందుకు వెళ్తున్న అభ్యర్థులకు వాడవాడలా, కాలనీలు బ్రహ్మరథం పడుతున్నారు. 22 నెలలుగా ఆపరిష్కృతంగా ఉన్న సమస్యలు, పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి, కారు కావాలా? బుల్డొజర్ కావాలా? అంటూ ప్రచారాన్ని హీటెక్కించారు. ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల కంటే ముందున్న బీఆర్ఎస్ జాతీయ పార్టీల డిపాజిట్లను గల్లంతు చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పావులు కదుపుతున్నారు.