వికారాబాద్, జూన్ 16 : వికారాబాద్ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధిని అడ్డుకుంటున్నది రాష్ట్ర శాసనసభా స్పీకర్ ప్రసాద్‌కుమార్ అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మండిపడ్డారు. మర్పల్లి మండలానికి చెందిన పలు గ్రామాల రైతులు, సర్పంచ్‌లతో కలిసి ఆయన మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ దీపక్తివారీని కలిసి సమస్యలు విన్నవించారు. ఈ సందర్భంగా మెతుకు ఆనంద్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సర్పంచ్‌లు ఉన్న గ్రామాలకు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు కేటాయించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్పల్లి మండలంలోని తుమ్మలపల్లిలో ఇటీవల సీసీ రోడ్డు వేశారని.. రోడ్డు ఎత్తుగా ఉండడంతో దానిని ఎక్కేందుకు, వాహనదారులు, పాదచారులు ఇబ్బందిపడుతున్నారు.
ఈ సమస్యను పరిష్కరించేందుకు గ్రామస్తులందరూ సమావేశమై రోడ్డు పక్కన మట్టి పోయాలని సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డుసభ్యులు, పంచాయతీకార్యదర్శి, ప్రజలతో కలిసి తీర్మానం చేయించి.. జేసీబీ, ట్రాక్టర్లతో మట్టి ని పోస్తుంటే.. పోలీసులు ఆ వాహనాలను పట్టుకుని వాటికి రూ. 20వేల నుంచి 30వేల జరిమానా విధించారని ఆవేదన వ్యక్తం చేశా రు. అదేవిధంగా గ్రామం నుంచి రైతుల పొలాలకు వెళ్లే నష్టబాట సక్రమంగా లేకపోవడంతో దానిని మట్టిపోసి పూడ్చేందుకు రైతులు యత్నిస్తుండగా ఇరిగేషన్ అధికారులు వారికి ఫోన్ చేసి కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రం నుంచి కానీ.. స్పీకర్ సొంత నిధులు కానీ.. పై గ్రామాలకు ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు.
సిరిపురంలో గత కేసీఆర్ హయాంలో రూ.19.50 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేస్తే ఇప్పటివరకు ఆ పనులకు ప్రారంభోత్సవమే చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుకాసురులు ఆయా గ్రామాల్లోని గుట్టలను మాయం చేస్తూ అక్రమంగా మట్టిని తరలిస్తే ఏ ఒక్క అధికారి, పోలీసులు పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తే అడ్డుకోవడం, కేసులు పెట్టడం ఏమిటని మండిపడ్డారు. పలు గ్రామాలకు మంజూరైన పనులను కూడా రద్దు చేయడం జరిగిందని దీనికంతటికి కారణం స్పీకర్ కుట్రలే అని ఆరోపించారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు, భవనాలు మంజూరు చేయకుండా అడ్డుకోవడం సరికాదని హెచ్చరించారు. రైతుల పక్షాన పోరాడే బీఆర్ఎస్ నాయకులు, రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందన్నారు.