సుడా టెండర్లలో కాంట్రాక్టర్లు సిండికేటుగా మారేందుకు వ్యూహాలు పన్నుతున్నారా..? పారదర్శకతకు పెద్దపీట వేయాల్సిన నేతలు అందుకు సహకరిస్తున్నారా..? సహకరించమే కాదు, దగ్గరుండి పనులు పంపిణీ చేస్తున్నారా..? అంటే అత్యంత విశ్వసనీయ సమాచారం ద్వారా అవుననే తెలుస్తున్నది. ఇటీవల నగరపాలక సంస్థ పరిధిలో రూ.50 కోట్లతో చేపట్టే టెండర్లలో కాంట్రాక్టర్లు సిండికేటుగా మారినట్టు వెలుగులోకి రావడం, అవి వివాదాస్పమై టెండర్లు రద్దయిన విషయం మరిచిపోక ముందే.. సుడాలోనూ అదే దారిలో వెళ్తున్నట్టు తెలిసింది. రూ.7 కోట్లతో చేపట్టాలని నిర్ణయించిన 55 అభివృద్ధి పనులకు టెండర్ దాఖలు గడువు నేటితో ముగియనుండగా, నేతలు, కాంట్రాక్టర్లు కలిసి పనులు పంపకాలు చేస్తూ సిండికేట్గా మారేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. ఇప్పటికే 35 పనులకు సంబంధించి ఓ అవగాహనకు రాగా, ఆయా కాంట్రాక్టర్ల నుంచి పగిడీలు కూడా వసూళ్లు అయినట్టు సమాచారం. మిగిలిన పనులకు సంబంధించి సైతం బేరసారాలు సాగుతున్నట్టు తెలుస్తుండగా, ఈ విషయం బయటకు వచ్చినా రద్దు కాకుండా ఉండేందుకు డబుల్ టెండర్లు వేయాలన్న నిర్ణయం జరిగినట్టు సమాచారం.
కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 16: శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) పరిధిలో రూ.7 కోట్ల వ్యయంతో 55 అభివృద్ధి పనులకు ఇటీవల టెండర్లు పిలిచారు. ఈ టెండర్లు దాఖలు చేయడానికి ఈ నెల 17 వరకు గడువు ఇచ్చారు. అయితే ఈ పనుల్లో రింగ్ కావడానికి ముందు నుంచే ఒక వ్యూహం ప్రకారం ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తున్నది. అందులో భాగంగా నే కొంత మంది అధికార పార్టీ నేతలు చక్రం తిప్పుతున్నట్టు సమాచారం. సదరు నేతలు ఇప్పటికే కాంట్రాక్టర్లతో సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. ఆ మేరకు ఒక సదరు నాయకులు, కాంట్రాక్టర్ల మధ్య ఓ అంగీకారం కుదిరినట్టు పలు వర్గాల ద్వారా తెలుస్తున్నది. మొత్తం 55 పనుల్లో 35 పనులకు సిండికేట్గా మారడానికి అంతా ఒకే అయినట్టు సమాచారం. మిగిలిన పనులకు సైతం రాజీ కుదుర్చడానికి సదరు నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారని, ఆ మేరకు కొంత మంది కాంట్రాక్టర్లు కూడా సహకరిస్తున్నట్టు తెలుస్తున్నది.
సిండికేట్ అయిన పనులకు గాను భారీ మొత్తంలో పగిడీలు వసూలు చేస్తున్నారని సమాచారం. ఒక్కో పని అంచనా విలువపై దాదాపు 8 నుంచి 10 శాతం వరకు ముందస్తుగా వసూలు చేస్తున్నారని, ఇలా పగిడీలు ఇవ్వడానికి ముందుకొచ్చిన కాంట్రాక్టర్లకే ఆ పనులు అప్పగించాలని ఓ అంగీకారానికి వచ్చినట్టు తెలిసింది. వసూలైన పగిడీల నుంచి రాజీ కుదర్చడంలో కీలక పాత్ర పోషించిన వారికి మెజార్టీ శాతం వాటా ఇవ్వడానికి సైతం ఒప్పందం జరిగినట్టు సమాచారం. అయితే ఈ విషయంలో విభేదించిన కొంతమంది కాంట్రాక్టర్లను లొంగతీసుకునే ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. నిజానికి ఇటీవల కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన రూ.50 కోట్ల పనుల్లో కాంట్రాక్టర్లు సిండికేట్గా మారడం, రూ.50 లక్షల వరకు పగిడీలు వసూలుచేయడం, ఆ విషయం బహిర్గతం కావడంతో కమిషనర్ టెండర్లు రద్దుచేసిన విషయం తెలిసిందే. దీనిపై కొంత మందికోర్టును ఆశ్రయించారు. ఈ విషయం ఇంకా మరిచిపోకముందే, సుడాలోనూ ఇదే తంతు జరుగడం విమర్శలకు తావిస్తున్నది.
కార్పొరేషన్ పరిధిలో జరిగిన టెండర్లలో సిండికేట్ కావడం, ఇదే సమయంలో సింగిల్ టెండర్ దాఖలు కావడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని టెండర్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న కాంట్రాక్టర్లు, నాయకులు ఈ సారి సిండికేట్గా మారినా.. టెండర్లు రద్దు కాకుండా ఉండేందుకు కొత్త వ్యూహం అనుసరించినట్టు తెలిసింది. కాగా, సుడా పరిధిలో జరుగుతున్న టెండర్లలో సిండికేట్గా మారిన తర్వాత డబుల్ టెండర్లు దాఖలు చేసేందుకు కాంట్రాక్టర్లు ప్లాన్ సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. అంచనా రేట్ల కన్నా అధికంగా వేస్తే టెండర్లు రద్దు చేసే అవకాశం ఉండడంతో అంచనా రేట్ల కన్నా కేవలం 0.1 శాతం తక్కువగా టెండర్ కోడ్ చేసి రెండు వేర్వురు సంస్థల పేరుతో ఒకే కాంట్రాక్టర్ టెండర్ దాఖలు చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారని సమాచారం.
డబుల్ టెండర్ రావడం వల్ల అధికారులు టెండర్లు రద్దు చేసే అవకాశం ఉండదని, తద్వారా సిండికేట్ విజయవంతం అవుతుందని, ఆ మేరకు పడిగీలు అనుకున్న విధంగా పంపకాలు చేసుకోవచ్చని భావిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి టెండర్లలో ఎలాంటి సిండికేటు లేకుండా పోటాపోటీగా బిడ్స్ దాఖలైతే కాంట్రాక్టర్లు 15 నుంచి 20 శాతం లేస్తో టెండర్లు దాఖలు చేసే అవకాశాలున్నాయి. గతంలోనూ అదేస్థాయిలో టెండర్లు దాఖలయ్యాయి. ఈ లెక్కన సిండికేటుగా మారడంతో సుడా ఆదాయానికి సుమారుగా కోటిన్నర వరకు గండి పడే అవకాశం ఉందన్న విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి టెండర్లల్లో సిండికేటుగా మారడం, వీటికి నేతలు సైతం పూర్తి సహకారం అందిస్తుండడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడే అవకాశం ఉండగా, ఏమైనా అవాంతరాలు ఏర్పడితే తిరిగి టెండర్లు పిలువాల్సిన పరిస్థితి వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే అభివృద్ధి పనులపై ఈ ప్రభావం పడుతుందన్న అభిప్రాయాలు వస్తున్నాయి.