కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 16: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధిపై నిర్లక్ష్యం ఎందుకని, చివరి దశలో పనులను పెండింగ్‌లో పెట్టడం సరికాదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపడ్డారు. పూర్వ జిల్లా ఎలగందుల వంతెన తుది దశ పనులు వెంటనే పూర్తి చేసి, మూడు, నాలుగు నెలల్లో ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రూ.90కోట్ల వ్యయంతో మానేరు నదిలో ఎలగందుల గ్రామానికి నిర్మించిన వారధి పనులను బీఆర్ఎస్ నాయకులతో కలిసి మంగళవారం పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయినా.. ఎలగందుల గ్రామం వైపు అప్రోచ్ రోడ్డు నిలిచిపోయినా పట్టించుకోకపోవడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పద్మనగర్ వైపు అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయన్నారు. మిగతా కొద్దిమొత్తంలో ఉన్న పనులు పూర్తి చేయకపోవడంలో ఆంతర్యం ఏంటని? ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం చూపుతుండడానికి ఇదే నిదర్శనమని విమర్శించారు. 1984లో ఎల్ఎండీ జలాశయం నిర్మాణంలో ఎలగందుల ఖిలాతో పాటు గ్రామం నీటిలో మునిగిపోయి రాకపోకలకు వీలులేకుండా పోయిందన్నారు. గ్రామస్తుల్లో చాలా మంది కరీంనగర్‌తో పాటు ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారని గుర్తుచేశారు. నాటి పాలకుల నిర్లక్ష్యంతో 16.5 కిలోమీటర్ల దూరం తిరిగి వెళ్లాల్సిన దుస్థితి దాపురించిందని దుయ్యబట్టారు. బ్రిడ్జి నిర్మాణంతో ఎలగందుల గ్రామంతో పాటు పరిసర గ్రామాలైన నాగుల మల్యాల, బావుపేట, బద్దిపల్లితోపాటు వేములవాడ-సిరిసిల్లకు వెళ్లేందుకు 7 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని భావించే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మానేరులో వారధి నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. 2016 ఆగస్టు 9న రూ.60కోట్లు మంజూరు చేస్తూ జీవో ఇవ్వడంతో పనులు ప్రారంభించారని చెప్పారు.
2021లో పెరిగిన ధరలకు అనుగుణంగా మరో రూ.30కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. బ్రిడ్జి పనులతో పాటు పద్మనగర్ వరకు మట్టిరోడ్డు పనులు పూర్తికాగా, ఎలగందుల వైపు మాత్రమే రోడ్డు మిగిలి ఉన్నాయన్నారు. 2025లోనే పూర్తికావాల్సి ఉన్నా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయన్నారు. ఈ పనులు ప్రారంభించింది తామేనని, పూర్తి చేయించాల్సిన బాధ్యత కూడా తమపైనే ఉందని, ఎస్టిమేట్లు రివైజ్ చేసి పంపాలని అధికారులకు సూచించామని వివరించారు. రూ.125కోట్లతో కమాన్‌పూర్ నుంచి సెంట్రల్‌లైటింగ్ ఏర్పాటు చేయగా, ఆ గ్రామంలో రోడ్డు పక్కన నీళ్లు నిలిస్తే, కేంద్ర, రాష్ట్ర మంత్రులు చూసి వెళ్లారే తప్ప నీటిని తొలగించేందుకు ఒక్క రూపాయి విడుదల చేయలేదని మండిపడ్డారు. కరీంనగర్-వరంగల్ పాత రోడ్డును తీగల వంతెనగా తీర్చిదిద్ది వినియోగంలోకి తెస్తే, చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయడంలేదని, నగునూర్ పాత రోడ్డు పనులనూ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం వీడాలని హితవు పలికారు.