ఆదిలాబాద్, జూన్ 16(నమస్తే తెలంగాణ) : వేలాది మందికి ఉపాధి కల్పించే ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నాయని.. కార్పొరేట్ సంస్థలకు పరిశ్రమను అమ్మకానికి పెట్టాయని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం మూతబడిన సీసీఐని పునఃప్రారంభించాలని, పరిశ్రమ కూల్చివేత పనులను ఆపివేయాలంటూ సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు.
నల్లజెండాలతో బీఆర్ఎస్ కార్యాలయం నుంచి సీసీఐ వరకు భారీగా మోటార్ సైకిల్ ర్యాలీ ని ర్వహించారు. అనంతరం సీసీఐ గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. కూల్చివేసిన పరిశ్రమ సామగ్రిని పరిశీలించారు. సీసీఐని ప్రారంభించాలంటూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరినా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టినా కనీస స్పందన లేదన్నారు. గతంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎంపీ, ఎమ్మెల్యేల ఇండ్ల ము ట్టడించిన ఎవరు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సీసీఐ సాధన కమిటీ ఆందోళనలకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు.

ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ మౌనం వీడాలి
ఆదిలాబాద్ జిల్లా కేంద్రం అభివృద్ధితోపాటు స్థానిక యువతకు ఉపాధి కల్పించే సిమెంటు పరిశ్రమ ప్రారంభ విషయంలో బీజేపీ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పందించాలని సూచించారు. సాధన కమిటీ సభ్యులు, భూ నిర్వాసితులు సీసీఐని పునః ప్రారంభించాలని ఆందోళనలు చేస్తున్న బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మాజీ మంత్రి హన్స్‌రాజ్ సీసీఐని ప్రారంభిస్తామని హామీ ఇచ్చినా ఇప్పుడు కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమలో వందేళ్ల సరిపడా ముడిసరుకు ఉందని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సీసీఐ ప్రారంభించడానికి చర్యలు తీసుకున్నా.. కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాధన కమిటీ నాయకులు విజ్జిగిరి నారాయణ, దర్శనాల మల్లేశ్, కొండ రమేశ్, ఈశ్వర్, నంది రామయ్య, గోడం గణేశ్, వెంకట నారాయణ, అరుమ్, నర్సింగ్, లంక రాఘువులు, బండి దత్తాత్రి, పోశెట్టిలు పాల్గొన్నారు.