వికారాబాద్, డిసెంబర్ 26 : పోలీసులు(Police) అత్యుత్సాహం ప్రదర్శించరాదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్(Methuku Anand) పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండలం నారాయణపూర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కావలి జ్యోతి భర్త కావలి నరేష్‌ను బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలనే లక్ష్యంగా చేసుకొని పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.
ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా పోలీసులు పారదర్శకంగా పనిచేయాలని కోరారు. అక్రమంగా కేసులు పెట్టడంతో ఇబ్బంది పడుతున్న కావలి నరేష్ , బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మాట్లాడి అధైర్యపడుద్దని, ఎల్లవేళలా అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రమేష్ గౌడ్, అనంత్ రెడ్డి, సీనియర్ నాయకులు బూరుగుపల్లి శ్రీనివాస్ రెడ్డి, వికారాబాద్ మండల పార్టీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, మండల కార్యనిర్వాహక అధ్యక్షులు పడిగళ్ల అశోక్, మండల మైనారిటీ విభాగం అధ్యక్షులు గయాజ్, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.