రామగిరి, డిసెంబర్ 26 : కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం నల్లగొండ పట్టణంలోని సుభాష్ విగ్రహం దగ్గర నల్ల జెండాలతో సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతాంగం నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన సందర్భంగా కనీస మద్దతు ధర చట్టం చేస్తామని విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకుంటామని హామీ ఇచ్చి దొడ్డిదారిన అమలు చేయడానికి కుట్ల చేస్తుందన్నారు. స్వాతంత్రానికి ముందు కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి, కార్పొరేట్ అనుకూల కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తెచ్చిందని వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
వామపక్ష పార్టీల పోరాటాల ఫలితంగా యూపీఏ వన్ ప్రభుత్వం తీసుకువచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పు చేసి విబిజి రాంజీ అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చారని, దీని ద్వారా రాష్ట్రాలకు 40 శాతం నిధులు వాటా ఉండాలని చెప్పడం వలన ఈ పథకం నిర్వీర్యమై పనులు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులకు ఉన్న కొద్దిపాటి హక్కులను కూడా తొలగించి కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా తెస్తున్న చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని దశలవారీగా జనవరి 19 కార్మిక కర్షక మైత్రి దినోత్సవం వరకు గ్రామ గ్రామాన ప్రజలను చైతన్యపరిచి ఉద్యమంలోకి తీసుకొస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల, సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, బొజ్జ చిన్న వెంకులు, వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి.సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేశ్, రైతు సంఘం జిల్లా నాయకుడు కుంభం కృష్ణారెడ్డి, సిఐటియు పట్టణ కన్వీనర్ అవుట రవీందర్, సంఘాల నాయకులు గంజి నాగరాజు మన్నెం భిక్షం, పోలే సత్యనారాయణ, సర్దార్ అలీ, కట్ట అంజయ్య, బొల్లు రవీందర్, గంజి రాజేశ్, ఆవుల అనురాధ, సల్లోజు విష్ణుమూర్తి పాల్గొన్నారు.