– రాజేశ్ కుటుంబానికి అండగా ఎస్సీ ఎస్టీ కమిషన్
– బాధ్యులపై చట్టపరమైన చర్యలు
– రూ.4,12,000 చెక్కును తల్లి లలితమ్మకు అందజేత
కోదాడ, డిసెంబర్ 26 : కర్ల రాజేశ్ మృతిపై వారం రోజుల్లోగా సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్, ఎస్పీ ని ఆదేశించినట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని కర్ల రాజేశ్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. రాజేశ్ మృతికి దారితీసిన పరిస్థితులను ఆయన తల్లి లలితమ్మను అడిగి తెలుసుకున్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమెను ఓదార్చుతూ, న్యాయం జరిగే వరకు కమిషన్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. రాజేశ్ మృతిలో బాధ్యులైన పోలీసు అధికారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే సీఐని సస్పెండ్ చేశారని, మిగిలిన వారిపై కూడా విచారణ జరిపిస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి రూ.4,12,000 చెక్కును తల్లి లలితమ్మకు అందజేసినట్లు చెప్పారు. మిగిలిన మొత్తాన్ని త్వరలోనే అందించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, నివసించేందుకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
70 సంవత్సరాల స్వాతంత్ర్య దేశంలో కూడా ఎస్సీ ఎస్టీలపై ఇంకా దాడులు కొనసాగడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మార్పీఎస్ నాయకులు రాజేశ్ మృతికి కారణమైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రాన్ని అందించారు. ఈ పర్యటనలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు శంకర్, జిల్లా సంక్షేమ అధికారి దయానందరాణి, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీఓ సూర్యనారాయణ, తాసీల్దార్ వాజిద్ అలీ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు మాదిగ, వడ్డేపల్లి కోటేశ్, కర్ల సుందర్ బాబు, గంధం పాండు, చీమ శ్రీనివాసరావు, గుండెపంగు రమేశ్, ఏపూరి సత్యరాజు, బచ్చలకూరి ప్రసాద్, చింతిరాల బాలచంద్రుడు, కుడుముల శ్రీను, మల్లెపంగు సూరి, గుడిపాటి కనకయ్య, సిద్దెల శ్రీను, పాతకోట్ల నాగరాజు, కొత్తపల్లి అంజయ్య, లంజపల్లి శ్రీను, సోమపంగు అశోక్, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.