వరంగల్ చౌరస్తా : కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల మూలంగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సోమవారం వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పేదల పట్ల ద్వంద్వ నీతిని అవలంబిస్తుందని మండిపడ్డారు. పేదల సంక్షేమాన్ని మరిచి కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నదని ఆరోపించారు.
ప్రజాపంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేసి పేద కుటుంబాలకు 14 రకాల నిత్యావసర వస్తువులను రేషన్ కార్డు ద్వారా అందించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలని అన్నారు. లేనియెడల భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఉద్యమిస్తామని హెచ్చరించారు. సిపిఐ వరంగల్ సహయ కార్యదర్శులు షేక్ బాష్ మియా, పనాస ప్రసాద్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు లక్ష్మణ్, గుండె బద్రి, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఓర్సు రాజు, తదితరులు పాల్గొన్నారు.