అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు రోడ్లపై సభలు, ర్యాలీలు జరపడాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ప్రజల భద్రతకోసం కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రోడ్లు, మార్జిన్లకు నిబంధన వర్తిస్తూ జీవోను జారీ చేసింది.ఇకపై రోడ్డపై కాకుండా ప్రత్యామ్నాయ ప్రదేశాలు ఎంపిక చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రోడ్లకు దూరంగా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రదేశాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సభలు, ర్యాలీలు జరుపుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అత్యంత అరుదైన సందర్భాల్లో షరతులతో అనుమతి ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
షరతులు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు, కందుకూరులో నిర్వహించిన సభల్లో తొక్కిసలాట జరిగి రెండు ఘటనల్లో 11 మంది చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.