చండీఘడ్: రైతు సంఘాల(Farmer Unions)తో జరిగిన ముగ్గురు కేంద్ర మంత్రుల సమావేశం ముగిసింది. అయితే ఆ సమావేశాలు పాజిటివ్‌గా ముగిసినట్లు కేంద్ర మంత్రి అర్జున్ ముండా తెలిపారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు మరోసారి రైతు సంఘాలతో భేటీ జరగనున్నట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు మాత్రం రైతు నేతలు తమ ఆందోళన కొనసాగించనున్నారు. పంజాబ్, హర్యానాలోని బోర్డర్ పాయింట్ల వద్ద వత్తిడి పెంచనున్నట్లు చెప్పారు.
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి ముండా, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర హోంశాక సహాయమంత్రి నిత్యానంద రాయ్.. రైతు సంఘాలతో సమావేశం నిర్వమించారు. పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని, దానికి సంబంధించిన చట్టాన్ని తయారు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
రైతు సంఘాలతో జరిగిన సమావేశంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పాల్గొన్నారు. గురవారం రాత్రి 8.45 నిమిషాలకు ప్రారంభమైన మీటింగ్ సుమారు అయిదు గంటల పాటు సాగింది. సుహృద్భావ వాతావరణంలో రైతు సంఘాలతో సమావేశాలు జరిగాయని, పాజిటివ్‌గా చర్చలు ముగిసినట్లు మంత్రి ముండా తెలిపారు. ప్రతి అంశంపై చాలా విస్తారమైన రీతిలో చర్చలు చేపట్టినట్లు వెల్లడించారు.