హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో (Jubilee Hills By-Election) బీఆర్ఎస్ గెలుపు తలుపువాకిట నిలిచి ఉన్నది. కాంగ్రెస్ (Congress) ఓటమి ఖాయమైంది. ఇదే నిజమైని అన్ని సర్వేలు తేల్చి చెప్పాయి. దీనినే రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలూ నిర్ధారించాయి. ఈ దశలో ధన ప్రవాహాన్ని పారించైనా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. రౌడీయిజంతో భయానక వాతావరణం సృష్టించేందుకు కుట్రలకు దిగబోతున్నది. అధికార దాహంతో ఎంతకైనా తెగించేందుకు సిద్ధమైందన్న అంశం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ కుట్రలో భాగంగా ఒకవైపు నియోజకవర్గానికి సంబంధంలేని ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతల ఇండ్లల్లో ఏమీ లేకున్నా పోలీసు సోదాలతో భయానక వాతావరణాన్ని సృష్టించి, ఆ తర్వాత కొన్ని గంటల్లోనే భారీ ఎత్తున డబ్బు సంచుల్ని అధికార పార్టీ దిగుమతి చేసినట్టు తెలుస్తున్నది.
ఈ మేరకు కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఇంటిలో శుక్రవారం సాయంత్రం ఓ కీలక భేటీ అనంతరం నోట్ల కట్టలతో పలువురు హస్తం నేతలు బయటికి వెళ్లిన వీడియోలు సామాజిక మాద్యమాల్లో పెను సంచలనం సృష్టించాయి. శుక్రవారం రాత్రి వరకు డివిజన్ ఇన్చార్జీల దాకా చేరిన నోట్ల కట్టలు అర్ధరాత్రి నుంచి బస్తీ లీడర్లకు చేరినట్టు సమాచారం అందుతున్నది. శనివారం నుంచి ఓటుకు రూ.5,000 పంచేందుకు రంగం సిద్ధం చేసినట్టు కాంగ్రెస్ శ్రేణులే చెప్తున్నాయి. ఇదే కాదు.. ‘ఇది నా ఇల్లు’ అంటూ నొక్కి వక్కాణించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రచారం ముగిసిన తర్వాత మరో భారీ కుట్రకు తెర లేపనున్నారనే సమాచారం కూడా బీఆర్ఎస్ నేతలకు అందుతున్నది. బీఆర్ఎస్ స్థానిక నేతలను బెదిరింపులకు గురి చేసేందుకు ఏకంగా ఇతర ప్రాంతాల నుంచి రౌడీషీటర్లను రంగంలోకి దింపుతున్నట్టుగా సమాచారం. నియోజకవర్గంలో భారీ ఎత్తున బోగస్ ఓట్లు వేయించేందుకు ఏకంగా బీదర్ నుంచి మూకలను సైతం ప్రత్యేకంగా తరలించేందుకు రంగం సిద్ధమవుతుందని తమకు పక్కా సమాచారం అందిందని బీఆర్ఎస్ నాయకుడొకరు తెలిపారు.
ఆఖరి దశలో అధికార కాంగ్రెస్ బరితెగింపునకు పాల్పడుతున్నది. ఆది నుంచి ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ విజయం ఖాయమని అనేక సర్వేలు తేల్చాయి. కాంగ్రెస్ అధికారిక సర్వేల్లోనూ ఇదేరీతిన కాంగ్రెస్ వెనుకంజను తేటతెల్లం చేశాయి. వీటన్నింటికీ మించి ప్రభుత్వపరంగా ఇంటెలిజెన్స్ వర్గాలతో నిర్వహించిన సర్వేలోనూ బీఆర్ఎస్ ఏకంగా 5 శాతం ఓట్లతో ముందంజలో ఉన్నట్టుగా ఇప్పటికే వార్తలు బయటికి పొక్కాయి. క్షేత్రస్థాయిలోనూ మంత్రులు, సీఎం ప్రచారంలో ప్రజల నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతోపాటు ముస్లిం మైనార్టీలు కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పబోతున్నారనే సంకేతాలూ ప్రభుత్వ పెద్దలకు చేరాయి.
ప్రజాబలాన్ని ఎలాగూ గెలువలేకపోతున్నందున ఒకవైపు ధనప్రవాహాన్ని పారించి, మరోవైపు బలప్రయోగంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు హస్తం నేతలు జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తం గా భారీ ఎత్తున ఏర్పాట్లు మొదలుపెట్టారు. శుక్రవారం ఒకేరోజు చోటుచేసుకున్న అనేక కీలక పరిణామాలు చూస్తే ఇవే సంకేతాలు కనిపించాయి. ప్రధానంగా ఎన్నికల ఘట్టం చివరి అంకానికి చేరుకోనుండటంతో అధికార కాంగ్రెస్ కుట్రలకు తెర లేపుతున్నట్టు స్పష్టమవుతుంది.
కాంగ్రెస్ కుట్రలో భాగంగా తొలుత బీఆర్ఎస్ శ్రేణులను భయపెట్టేందుకు పావులు కదిపింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఏడు గంటలకే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి ఇంటిపై పోలీసులతో దాడికి ఉసిగొల్పింది. వాస్తవానికి ఉప ఎన్నిక దరిమిలా ఈ ఇంట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు ఉంటున్నారు. అందుకే ఇద్దరు ఎన్నికల అధికారులతోపాటు పోలీస్ ఉన్నతాధికారులు, 100 మందికిపైగా పోలీస్ బలగాలు ఒక్కసారిగా ఆ ఇంటిపై విరుచుకుపడ్డాయి. ఏకంగా రెండు గంటలకు పైగా ఆ ఇంటిని చుట్టుముట్టాయి. అరగంట పాటు సోదాలు నిర్వహించినట్టు చేసి.. ఆపై నివేదికలు రూపొందించాలంటూ మరో రెండు గంటలకు పైగా అక్కడే కాలయాపన చేశారు. ఆ ఇల్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాకుండా కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్నదనే విషయం తెలిసినప్పటికీ అధికారులు, పోలీసులు ఆ ఇంటిపై దాడి చేయడం వెనుక అధికార కాంగ్రెస్ కుట్ర దాగి ఉన్నదని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.
ఉదయం బీఆర్ఎస్ నేత ఇంటిపై సోదాల పేరిట హంగామా సృష్టించి, సాయంత్రానికి ఎంపీ, ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఇంట్లో అధికార పార్టీ హైడ్రామా మొదలుపెట్టింది. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ మల్లు రవితోపాటు సీఎం సన్నిహితుడు రోహిణ్‌రెడ్డి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని డివిజన్ కాంగ్రెస్ ఇన్చార్జులతో కీలక భేటీ నిర్వహించారు. అందులో ఓటుకు నోటుపై విస్తృతంగా చర్చ జరిగినట్టుగా ప్రచారం జరుగుతున్నది. ఆ భేటీ అనంతరం బయటికొస్తున్న నేతల చేతుల్లో నోట్ల కట్టలున్న సంచులు ఉండటం.. ఆ వీడియోలు సామాజిక మాద్యమాల్లో వైరల్ కావడం పెను సంచలనం సృష్టించింది. ఈ సమాచారాన్ని అందుకుని మీడియా అక్కడికి వెళ్లారు. ఫొటోలు, వీడియోలు తీయకుండా కాంగ్రెస్ శ్రేణులు బెదిరింపులకు పాల్పడటంతో ధన ప్రవాహంపైనే ఈ భేటీ జరిగినట్టుగా రూఢీ అయిందని అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులు చెప్తున్నారు. సదరు ఇంట్లోకి రూ.కోట్లాది నగదు మూటలు దిగాయని, వాటిని భేటీకి హాజరైన నేతలకు లక్షల్లో విభజించి పంపిణీ చేశారనే ప్రచారం జరుగుతున్నది. ఇక్కడో మరో కీలక విషయమేమంటే… శుక్రవారం ఉదయం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ ప్రచారానికి బయటికి రాలేదని విశ్వసనీయంగా తెలిసింది. అంటే సదరు కార్పొరేటర్ ఇంటికి కోట్ల కట్టలు వచ్చేందుకు.. ఈ పరిణామానికి లింకు ఉండొచ్చనే అనుమానులున్నాయి.
ఉప ఎన్నికలో ధన ప్రవాహాన్ని పారించేందుకు శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ ఇన్చార్జులకు లక్షల కొద్దీ నోట్ల కట్టల చొప్పున కోట్లాది రూపాయల్ని క్షేత్రస్థాయిలోకి దిగుమతి చేశారని ప్రచారం జరుగుతున్నది. వీటిని అర్ధరాత్రి నుంచే బస్తీలకు చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారని సమాచారం. మంత్రుల పర్యవేక్షణలో డివిజన్ ఇన్చార్జులకు చేరిన ఆ డబ్బు సంచులు.. బస్తీలకు చేరినట్టు కాం గ్రెస్ శ్రేణులే ఒప్పుకుంటున్నాయి. ఆయా నేతలు ఓటుకు రూ.5 వేల చొప్పున ఓటర్లకు పంచాలనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ఓ బస్తీ నేత చెప్పారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పెద్ద ఎత్తున బోగస్ ఓట్లను నమోదు చేయించిందనే విషయం గతంలోనే బయటికొచ్చింది. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు క్షేత్రస్థాయిలోని అపార్ట్మెంట్లు, ఇండ్ల వద్దకు వెళ్లి బోగస్ ఓట్ల గుట్టును బయటపెట్టారు. ఎన్నికల అధికారులు సైతం అవి బోగస్ ఓట్లేనని అంగీకరించారు. దీంతోపాటు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ స్వయంగా ఓటరు ఐడీ కార్డులను పంపిణీ చేయడంపైనా కేసు నమోదైంది. ఆ బోగస్ ఓట్లను వేయించేందుకు అధికార పార్టీ బీదర్ నుంచి కొన్ని మూకల్ని రంగంలోకి దింపేందుకు కూడా ఒప్పందం చేసుకున్నదనే సమాచారం తమకు ఉన్నదని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో నమోదైన బోగస్ ఓటర్ల స్థానంలో బీదర్ నుంచి వచ్చిన వ్యక్తులను మోహరించి ఓట్లు వేయించేందుకు ప్రణాళిక రూపొందించారని తెలిపారు. శుక్రవారం బీఆర్ఎస్ నేతల ఇండ్లలో సోదాలు నిర్వహించిన అధికార యంత్రాంగం అక్కడ నయా పైసా లేకున్నా గంటలకొద్దీ హల్చల్ చేసింది. కానీ సాయంత్రం కార్పొరేటర్ ఇంటి వద్ద నోట్ల కట్టలు తీసుకొని బయటికొస్తున్న దృశ్యాలు బయటికొచ్చినా ఎవరూ స్పందించలేదు. దీంతో బీదర్ వ్యక్తులతో బోగస్ ఓట్లను వేయించే సమయంలోనూ ఈ యంత్రాంగం చర్యలు తీసుకుంటుందనే నమ్మకం తమకు లేదని, నిష్పక్షపాతంగా ఉండాల్సిన అధికారులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఉప ఎన్నికలో ప్రచార ఘ ట్టం పూర్తిగా ముగియకముందే ధన ప్రవాహానికి తెరలేపిన కాంగ్రెస్ పార్టీ.. ప్రచార ఘట్టం ముగియగానే బెదిరింపులకు స్కెచ్ వేసినట్టుగా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఈ మేరకు తమకు పక్కా సమాచారం ఉన్నదని అంటున్నారు. ఆదివా రం సాయంత్రం ప్రచారఘట్టం ముగిసిన వెంటనే ఎన్నికల నిబంధనల మేరకు స్థానికేతరులు నియోజకవర్గాన్ని విడిచి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో బీఆర్ఎస్ ఇతర ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలంతా జూబ్లీహిల్స్ నుంచి బయటికి వెళ్తారు. అప్పటి నుంచి ఇతర ప్రాంతాల నుంచి రౌడీషీటర్లు, వారి అనుచరులను రంగంలోకి దింపేందుకు హస్తం నేతలు ఏర్పాట్లు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపి స్తున్నారు.