హుస్నాబాద్/నంగునూరు/హుస్నాబాద్‌రూరల్/ చేర్యాల/తొగుట/దుబ్బాక/మద్దూరు, మార్చి 7: మహిళా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్ అన్నారు. సోమవారం హుస్నాబాద్ పట్టణంలోని కస్తూర్బాగాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలలో టీఆర్ఎస్వీ, యూత్ విభాగం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థినులను సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఇచ్చేందుకు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధిని సాధించాలని సూచించారు.
ఆడబిడ్డల ఆత్మబంధువు సీఎం కేసీఆర్..
దుబ్బాక టౌన్, మార్చి 7 : ఆడబిడ్డల ఆత్మబంధువు సీఎం కేసీఆర్ అని దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ వనితాభూంరెడ్డి అన్నారు. సీఎం చూపిన ఆత్మైస్థెర్యంతో మహిళలు ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురష్కరించుకొని సోమవారం దుబ్బాకలో ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆర్పీలను సన్మానించారు. ఈ సందర్భంగా వనిత మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా మహిళల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు.
మహిళా దినోత్సవ సంబురాలు..
నంగునూరు మండలం పాలమాకులలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ఫ్లెక్సీలకు ప్రజాప్రతినిధులు, మహిళలు పాలాభిషేకం చేశారు. హుస్నాబాద్ మండలం పొట్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులకు గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు అనిల్‌గౌడ్ సాంకేతిక పరిజ్ఞాన పుస్తకాలను అందచేశారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఉల్లెంగల సేవా ట్రస్ట్ చైర్మన్ ఏకానందం, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మాజీ జడ్పీటీసీ పద్మాఏకానందం ఆధ్వర్యంలో చేర్యాల పట్టణంలోని కల్యాణి గార్డెన్స్‌లో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తొగుటలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహిళా ప్రజాప్రతినిధులు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లను సన్మానించారు. మద్దూరు మండలం వంగపల్లిలో సర్పంచ్ భాగ్యలక్ష్మిశ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆశ కార్యకర్తలు, గ్రామ పంచాయతీ మహిళా సిబ్బందిని ఘనంగా సన్మానించారు. దుబ్బాక వ్యవసాయ పరపతి సహకార సంఘంలో మహిళా డైరెక్టర్లు భూదవ్వ, రేణుకలను సన్మానించారు.
ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
– డిపో మేనేజన్ సదాశివ్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ వివిధ సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజన్ ఎన్.సదాశివ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 60 ఏండ్లు పైబడిన మహిళలకు నేడు (మంగళవారం) ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందన్నారు. మహిళలకు ఉచితంగా లైసెన్స్‌లు ఇచ్చేందుకు ఈనెల 31లోపు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. డ్వాక్రా మహిళలు ఈనెల 31 వరకు వారి ఉత్పత్తులను ఆర్టీసీ బస్టాండ్‌లో ఉంచి విక్రయించుకోవచ్చన్నారు. గర్భిణులు, బాలింతలకు పల్లె వెలుగులో 4,5వ నంబర్ సీట్లు, ఎక్స్‌ప్రెస్‌లో 1,2 నంబర్ సీట్లు కేటాయించామని చెప్పా రు. ఈనెల 31 వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన మహిళలు తమ టికెట్ వెనుకాల ఫోన్ నంబర్ రాసి బస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన బాక్సులో వేయాలని, 31న లక్కీడ్రా తీస్తామన్నారు. నెలవారీ సీజన్ పాస్‌లు కలిగి ఉన్న మహిళలను ఆర్టీసీ డిపోలో సన్మానించే కార్యక్రమం కూడా ఉంటుందని తెలిపారు.