తూప్రాన్, ఏప్రిల్ 15 : పాఠశాలల్లోనే విద్యార్థులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసి సరికొత్త కార్యక్రమానికి మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ శ్రీకారం చుట్టారు. తూప్రాన్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 241మంది విద్యార్థులకు బుధవారం అక్కడే కుల, ఆదాయ, స్థానిక ధ్రువీకరణ పత్రాలు ఉచితంగా జారీచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ.. ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి విద్యార్థులు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో బడికి వెళ్లి అధికారులతో కలిసి సర్టిఫికెట్లు జారీచేసినట్టు పేర్కొన్నారు.
ఈ పాఠశాలలో ఉచితంగా జారీచేశామని, మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నామమాత్ర రుసుముతో విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు జారీచేస్తామని తెలిపారు. పదోతరగతి విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ధ్రువీకరణ పత్రాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా తూప్రాన్‌లోనే ప్రారంభించినట్టు చెప్పారు. కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎంఈవో తదితరులు పాల్గొన్నారు.