హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో ఇటీవల ప్రవేశపెట్టిన ‘వాహన్’ ప్రయోగం వికటించినట్టు వాహనదారులు చెప్తున్నారు. సాఫ్ట్‌వేర్‌లో లోపాలతోపాటు.. రిజిస్ట్రేషన్లపై సిబ్బందికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడంలో ఆర్టీఏ అధికారులు విఫలమవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంటున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వాహనాల పర్మినెంట్ రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నట్టు తెలిసింది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ రెన్యువల్, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్, ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ, గూడ్స్, ప్యాసింజర్ వాహనాలకు పర్మిట్ల జారీ, రోడ్డు ట్యాక్స్ చెల్లింపు వంటి పనులను ‘వాహన్’లో చేపడుతున్నారు. ఇటీవల ఆర్టీఏ నుంచి పొందే సేవలన్నీ.. కేంద్రం తీసుకొచ్చిన ‘వాహన్’ పోర్టల్‌లోకి మారాయి. ఈ సాఫ్ట్వేర్ వినియోగంపై సిబ్బందికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. షోరూమ్‌లోనే వాహనాల రిజిస్ట్రేషన్లు చేస్తామని రవాణా శాఖ ప్రచారం చేసుకున్నది. ఈ క్రమంలో ‘వాహన్’తో సాఫ్ట్వేర్ తంటాలు మొదలయ్యాయి.
అప్లికేషన్ల ప్రక్రియ ముందుకు సాగడం లేదని సాక్షాత్తు సిబ్బందే చెబుతున్నారు. 20 రోజులుగా కొత్త రిజిస్ట్రేషన్ నంబర్లు జనరేట్ కావడం లేదని తెలిసింది. రిజిస్ట్రేషన్లలో జరుగుతున్న ఆలస్యంపై వాహనదారులు ప్రశ్నిస్తుండటంతో షోరూమ్ సిబ్బంది సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు వాహనదారులు చెప్తున్నారు. టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసినా సమాధానం లేదని వాపోతున్నారు. స్పెషల్ నంబర్ కోసం ఒకటికి రెండుసార్లు డబ్బులు కట్టిన వాహనదారులకు కోరుకున్న నంబర్ కేటాయింపు కావడం లేదని సమాచారం. డబ్బు రిఫండ్ చేయాలని అడిగితే.. అది తమ చేతుల్లో లేదని.. మీసేవకు వెళ్లాలంటూ సిబ్బంది నుంచి సమాధానం వస్తున్నదని తెలిసింది. మీసేవ టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేస్తే అక్కడ్నుంచీ సమాధానం రావడం లేదని వాహనదారులు చెబుతున్నారు. సమస్యను రవాణాశాఖ ఉన్నతాధికారులు వెంటనే పరిషరించాలని డిమాండ్ చేస్తున్నారు.