హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : నాడు ఓట్ల కోసం అలవికాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు మోసపూరిత విధానాలతో అన్ని వర్గాలను వంచిస్తున్నదని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. శుక్రవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలతో రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నదని ఆరోపించారు. మూసీ బ్యూటిఫికేషన్ పేరిట రూ.లక్ష కోట్ల దోపిడీకి స్కెచ్ వేస్తున్నదని ఆరోపించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఎన్టీపీసీ 2,400 మెగావాట్ల విద్యుత్తును తెలంగాణకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు పూనుకోవడంలో మతలబు ఏంటని ప్రశ్నించారు.
పవర్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) గురించి తెలియని మంత్రి పవర్ సెక్టార్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. పీఎల్ఎఫ్ కేవలం 5 నుంచి 9% ఉన్నదని, ఈ పరిస్థితిలో కొత్త విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటు ఎందుకని ప్రశ్నించారు. అణువిద్యుత్తు గురించి ఎప్పుడైనా ఆలోచించారా? బ్యాటరీ స్టోరేజ్‌పై దృష్టిపెట్టడంలేదెందుకు? అని నిలదీశారు. ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం ఇవ్వాల్సిన మంత్రి మౌనంగా ఉండటం, సంబంధంలేని శాఖ మంత్రి జవాబులు చెప్పడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. తమ్మిడిహట్టి నుంచి సుందిళ్ల బరాజ్‌కు నీళ్లు ఎత్తిపోస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. అసలు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎల్లంపల్లి నుంచి ఎన్ని టీఎంసీల నీళ్లు ఎత్తిపోశారు? ఎల్లంపల్లి నుంచి వృథాగా సముద్రంలో కలుస్తున్న నీళ్ల సంగతేంటి? అని ప్రశ్నించారు. తమ్మిడిహట్టి- సుందిళ్ల ప్రాజెక్టు పేరిట రూ.9 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్లు వృథా చేస్తున్నారని ఆరోపించారు.
హిల్ట్ పాలసీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం భూ దోపిడీకి తెరలేపిందని పొన్నాల ఆరోపించారు. కాంగ్రెస్ తెచ్చింది హిల్ట్ పాలసీ కాదు.. టిల్ట్ పాలసీ అని ఎద్దేవా చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేయకుండా కొడంగల్ లిఫ్ట్ ప్రాజెక్టును తెరపైకి తేవడంలోని ఆంతర్యమేంటని ప్రశ్నించారు. కమీషన్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నదని విమర్శించారు. సంక్షేమానికి పైసల్లేవని బుకాయిస్తున్న ప్రభుత్వం పెద్ద పెద్ద పథకాలు, అభివృద్ధి పనులకు నిధులెక్కడి నుంచి తీసుకొస్తుందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పనుల పేరిట కాంగ్రెస్ నాయకులు సొమ్ములు కూడబెట్టుకునేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.
రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ఉద్యోగుల నుంచి మొదలుకొని అన్నదాతల వరకు అన్ని వర్గాలు దగాకు గురయ్యాయని బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ విమర్శించారు. ఇచ్చిన హామీలు గాలికొదిలి అక్రమాలకు తెరలేపిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ మాత్రం ప్రజల తరఫున పోరాడటంలో సఫలమైందని పేర్కొన్నారు. నాడు తెలంగాణ ఏర్పాటుకు అడ్డుపడ్డ శక్తులే నేడు కేసీఆర్, బీఆర్ఎస్ను బద్నాం చేస్తున్నాయని విమర్శించారు. దీక్షా దివస్ సాక్షిగా దుష్టశక్తులకు బుద్ధిచెప్పాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు దూదిమెట్ల బాలరాజుయాదవ్, వెంకటేశ్‌గౌడ్, కిశోర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.