వేములవాడ/ సిరిసిల్ల రూరల్/ వేములవాడ రూరల్, నవంబర్ 29: మాజీ మావోయిస్టు, బీఆర్ఎస్ నేత బల్లెపు నర్సయ్య అలియాస్ సిద్దన్న అలియాస్ బాపురెడ్డి హత్యకు గురయ్యాడు. ఇంటర్వ్యూ పేరిట పిలిచి దారుణంగా హత్య చేశాడు. తన తండ్రిని చంపాడన్న కక్షతో హత్య చేసిన నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకున్నది. తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట గ్రామానికి చెందిన బల్లెపు నర్సయ్య(67) సుదీర్ఘకాలంపాటు పీపుల్స్‌వార్ గ్రూపులో పనిచేశారు. 20 ఏండ్ల కిందట లొంగిపోయి గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. అయితే మూడేండ్ల కిందట ఓ యూట్యూబ్ చానల్‌కు నర్సయ్య ఇంటర్వ్యూ ఇచ్చాడు. మావోయిస్టుగా ఉన్న టైంలో ఫలానా వారిని ఇలా చంపామంటూ ఇంటర్వ్యూలో చెప్పాడు. తమ చేతిలో హత్యకు గురైన వారిలో వీర్నపల్లి గ్రామానికి చెందిన అంజయ్య కూడా ఉన్నట్టు వెల్లడించాడు. ఆ ఇంటర్వ్యూను అంజయ్య కొడుకు సంతోష్ చూశాడు.
తన తండ్రిని చంపిన నర్సయ్యను ఎలాగైనా మట్టుబెట్టాలని ప్లాన్ వేశాడు. తాను యూట్యూబ్ చానల్ నిర్వాహకుడినంటూ నర్సయ్యతో పరిచయం పెంచుకున్నాడు. ఇంటర్వ్యూ ఇవ్వాలని గురువారం మధ్యాహ్నం నర్సయ్యను అగ్రహారం గుట్టల్లోకి రప్పించి, మద్యం తాగించి బండరాయితో కొట్టి, గొంతుకోసి చంపిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. హత్య తర్వాత నిందితుడు సంతోష్ లొంగిపోయినట్టు పోలీసులు చె ప్పారు. హత్య జరిగిన ప్రాంతాన్ని ఎస్పీ మహేశ్ పరిశీలించారు. కేసు దర్యాప్తు ప కడ్బందీగా చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. నర్సయ్యకు ఇద్ద రు భార్యలు. మొదటి భార్యకు కొడుకు అశోక్, రెండో భార్యకు కొడుకు నరేశ్, కూతురు ఉన్నారు. ఈ హత్యలో పలువురి ప్రమేయం ఉన్నదని నర్సయ్య కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వేములవాడ దవాఖానలో శుక్రవారం నర్సయ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రస్తుతం కొడుకు అశోక్ ఉపాధి నిమిత్తం బహ్రెయిన్‌లో ఉండగా, తండ్రి మృతి వార్త తెలుసుకొని స్వగ్రామానికి బయలుదేరాడు. శనివారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.
వేములవాడకు చెందిన మరో మాజీ మావోయిస్టును కూడా హత మార్చేందుకు సంతోష్ ప్లాన్ చేసినట్టు తెలిసింది. సదరు మాజీని సైతం ఇంటర్వ్యూకు రావాలని సంతోష్ కోరాడు. తాను ఇంటి నుంచి బయటకు రానని, ఏదైనా పని ఉంటే ఇంటి వద్దకు రావాలని సదరు మాజీ మావోయిస్టు సూచించినట్టు సమాచారం. కాగా, హత్య నేపథ్యంలో జిల్లాలోని మాజీలందరినీ పోలీసులు అప్రమత్తం చేసినట్టు తెలిసింది.
నర్సయ్య 2004లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. తర్వాత కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గ్గొన్నారు. కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరి చురుగ్గా పనిచేశాడు. 2014లో ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోయాడు. తర్వాత సిరిసిల్ల ఏఎంసీ డైరెక్టర్‌గా పనిచేశాడు. నర్సయ్య హత్యకు గురికావడంతో బీఆర్ఎస్ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేములవాడ దవాఖానకు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, సింగిల్‌విండో చైర్మన్ బండి దేవదాస్‌గౌడ్, పడిగెల రాజు, ఇతర నేతలు వెళ్లి పోస్టుమార్టం పూర్తయ్యేదాకా అక్కడే ఉన్నారు.