ఉట్కూర్ : ప్రభుత్వ బడులలో ( Government School ) ప్రైవేటుకు దీటుగా విద్యాబోధన ఉంటుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పించాలని ఎంపీవో లక్ష్మీ నరసింహరాజు ( MPO Laxminarasimha raju ) అన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం వల్లంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయిని సుజాత ఆధ్వర్యంలో విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు, ఉపాధ్యాయులు చిన్నారుల చేత అక్షరాలు దిద్దించారు. అనంతరం తల్లిదండ్రులకు బడి ప్రాముఖ్యతను వివరించారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు కృషి చేయాలని సూచించారు. పలువురు అంగన్వాడీ చిన్నారులను పాఠశాలలో చేర్పించారు.
కార్యక్రమంలో ప్రత్యేక అధికారి అంజమ్మ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ నాగమణి, ఉపాధ్యాయులు శశిధర్ రెడ్డి, సత్యపాల్, గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగేశ్వరి, అంగన్వాడీ టీచర్లు శిరీష , సావిత్రి , ఆశ కార్యకర్త మణెమ్మ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.