సిద్దిపేట, ఫిబ్రవరి 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సర్పంచ్‌గా గ్రామాభివృద్ధికి కృషిచేయాల్సిన ఆయన సొంతింటిని చక్కబెట్టుకున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ (ఈజీఎస్) పనుల్లో అందిన కాడికి దోచుకుని సొమ్ముచేసుకున్నారు. సిద్దిపేట రూరల్ మండల బుస్సాపూర్‌లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ (ఈజీఎస్) పనుల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. తాజా మాజీ సర్పంచ్ సదాశివరెడ్డి తన కుటుంబసభ్యుల పేర్ల మీద పనులు చేయకున్నా చేసినట్టు రికార్డులు చేయించి అక్రమంగా బిల్లులు డ్రా చేసుకున్నారు. క్యాటిల్ షెడ్, అవెన్యూ ప్లాంటేషన్, పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణాలు, గ్రామంలో చేపట్టిన ప్రతి పనిలో అక్రమాలు జరిగాయి.
కుటుంబ సభ్యుల పేర్లమీద డబ్బులు డ్రా..
బుస్సాపూర్ తాజా గ్రామ మాజీ సర్పంచ్ సదాశివరెడ్డి తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరించారు. పదవిలో ఉండగా ఉపాధిహామీ పనుల్లో అక్రమాలకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు పనులు చేయకపోయినా చేసినట్లు రికార్డు చేయించి వారి పేర్ల మీద డబ్బులు డ్రా చేశారు. ఆయన భార్య సిద్దిపేటలో ఉంటుంది. ఏనాడు గ్రామంలో ఉపాధిహామీ పనులకు హాజరు కాలేదు. కానీ, ఆమె పేరిట గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్, వివిధ పనులు చేపట్టినట్లు ఐడీ నెంబర్ (010714) మీద బిల్లు రికార్డు చేసి రూ. 57,303 డబ్బులు తీసుకున్నారు. సర్పంచ్ పెద్దన్న రాజిరెడ్డి సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఆయన కర్ణాటకలో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన పేరిట గ్రామంలో ప్లాంటేషన్, కాంపౌండ్ వాల్ నిర్మాణం, ఇతర పనులు చేసినట్లు ఐడీ నెంబర్ (010718) మీద పనిదినాలు రికార్డు చేసి బిల్లులు చేశారు. ఈయన ఎప్పుడు కూడా ఉపాధిహామీ పనికి పోయింది లేదు.
ఈయన వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో రూ. 30,376 జమయ్యాయి. ఇక మాజీ సర్పంచ్ తండ్రి సత్యనారాయణరెడ్డి గ్రామంలోనే ఉంటారు. ఆయన ఉపాధిహామీ పనులకు పోడు. కానీ, గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో ఈయన ఐడీ 010251 మీద ఎంపీపీఎస్ బుస్సాపూర్ పాఠశాలలో టాయిలెట్ల నిర్మాణ పనులు చేసినట్లు రికార్డు చేశారు. ఈయన పేరిట రూ. 19,490 డ్రా చేసుకున్నారు. తల్లి జయమ్మ పేరు మీద ఐడీ నెంబర్ 010679 మీద రూ. 11,149 తో పాటు సీసీ నిర్మాణంలో పని చేసినట్లు డబ్బులు డ్రా చేసుకున్నారు. గ్రామంలో పాత కిచెన్ షెడ్డు మీద బిల్లులు డ్రా చేశారు. ఇలా ఒకటి ఏమిటి ఏది దొరికితే దాని మీద కుటుంబ సభ్యుల పేర్ల మీద రికార్డులు చేయించి మాజీ సర్పంచ్ బిల్లులు తీసుకున్నారు. గ్రామంలో చేపట్టిన ప్రతి పనిలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Medak1
7 కల్లాల్లో 6 కుటుంబ సభ్యులకే…
ఉపాధిహామీ పథకంలో వ్యవసాయ బావుల వద్ద కల్లాలు నిర్మించుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. బుస్సాపూర్ గ్రామానికి 7కల్లాలు మంజూరయ్యాయి. గ్రామంలో ఏ రైతుకు ఇవ్వకుండా మాజీ సర్పంచ్ సదాశివరెడ్డి తన కుటుంబ సభ్యుల పేర్ల మీదనే 6 కల్లాలు మంజూరు చేయించుకొని నిర్మాణం చేసుకున్నారు. ఒకటి మాత్రమే ఇతర రైతుకు కేటాయించారు. దీనిపై గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ధాన్యం పోద్దామంటే కల్లాలు లేక రోడ్ల మీద పోసుకుంటున్నామని రైతులు తెలిపారు. తాజా మాజీ సర్పంచ్ తన అధికారంతో గ్రామానికి వచ్చిన పనులన్నీ తన కుటుంబ సభ్యులకే కేటాయించారని ఆరోపించారు. గ్రామంలో విద్యుత్ దీపాల బిల్లుల్లో సైతం భారీగా అక్రమాలు జరిగినట్లు తెలిసింది. ఫిజికల్‌గా ఒకటి చూపించి రికార్డులో మరోటి చూపి వేల రూపాయలు కాజేసినట్లు తెలిసింది. తన ఇంట్లో పెట్టుకున్న బల్బులు రికార్డులో చూపించారు. విద్యుత్ బిల్లులపైనే దాదాపుగా వేల రూపాయల కుంభకోణం జరిగింది. గ్రామంలో ఈ మధ్య కాలంలో జరిగిన వాటిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తే మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.