Stock Market | ముంబై, ఏప్రిల్ 24 : దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్‌పడింది. మదుపరులు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గుచూపడంతోపాటు కార్పొరేట్ల నిరుత్సాహక ఆర్థిక ఫలితాలు సూచీలను నష్టాల్లోకి నెట్టింది. బ్లూచిప్ సంస్థల షేర్లు కుప్పకూలడం, ఆసియా-యూరప్ ఈక్విటీలు ఒడిదుడుకులకు లోనుకావడం మదుపరులను అమ్మకాలవైపు నడిపించాయి. ఫలితంగా ఏడు రోజులుగా భారీగా పుంజుకున్న సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఇంట్రాడేలో 400 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 315.06 పాయింట్లు కోల్పోయి 79,801.43 వద్ద ముగిసింది. మరోసూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 82.25 పాయింట్లు కోల్పోయి 24,246.70 వద్ద స్థిరపడింది. గడిచిన ఏడు రోజుల్లో సెన్సెక్స్ 6,269.34 పాయింట్లు లేదా 8.48 శాతం, నిఫ్టీ 1,929.8 పాయింట్లు లేదా 8.61 శాతం చొప్పున పెరిగిన విషయం తెలిసిందే. కార్పొరేట్ల నిరుత్సాహక ఫలితాలు మార్కెట్ల ర్యాలీకి బ్రేక్‌లు వేశాయని జియోజిట్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.