Manne Krishank | తెలంగాణ రాష్ట్రంలో ఇసుక తవ్వకాల ఆదాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలు పూర్తిగా తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు (2014కు ముందు) కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ఇసుక తవ్వకాల ద్వారా వచ్చిన ఆదాయం కేవలం ₹39 కోట్లే అని తెలిపారు. కానీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలతో ఇసుక ఆదాయం గణనీయంగా పెరిగిందని అన్నారు. ఒక్క సంవత్సరంలోనే రూ.886 కోట్లకు చేరిందని చెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుక ధర టన్నుకు రూ.645 మాత్రమే ఉండేదని.. ప్రజలకు అందుబాటులో ఉండేదని క్రిశాంక్ తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సాండ్ బజార్ పేరుతో ఇసుక ధరను రూ.1600కు పెంచి, అదనంగా రవాణా భారం కూడా ప్రజలపై మోపుతోందన్నారు. సర్వీస్ ఛార్జీలు టన్నుకు కాంగ్రెస్ ప్రభుత్వం ₹3 నుంచి ₹100కు పెంచబడినప్పటికీ, ఆదాయం మాత్రం పెరగకపోవడం అనుమానాస్పదమని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే ఇసుక తవ్వకాలు జరగ్గా, ఇప్పుడు పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు తవ్వకాలు, 24 గంటల రవాణా అనుమతించినప్పటికీ ఆదాయం రెట్టింపు కాలేదని మన్నె క్రిశాంక్ తెలిపారు. ఈ పరిస్థితి చూస్తే ఇసుక ఆదాయం “సాండ్ మాఫియా” చేతుల్లోకి వెళ్లిపోతుందనే అనుమానాలు బలపడుతున్నాయని పేర్కొన్నారు.
ముఖ్యంగా, ప్రస్తుత ముఖ్యమంత్రి కార్యాలయ సీపీఆర్వోగా ఉన్న గుర్రం మల్సూర్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్ఎండీసీ (TSMDC) మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. కాబట్టి, ఆయనకు వాస్తవ గణాంకాలు బాగా తెలుసని క్రిశాంక్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ విజయాలను వక్రీకరించి, తప్పుడు గణాంకాలతో ప్రజలను మోసం చేస్తోంది అనే విషయంపై సీపీఆర్వో మల్సూర్ వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇసుక తవ్వకాల ఆదాయంపై పారదర్శకత కోసం పూర్తి వివరాలు ప్రజలకు వెల్లడించాలన్నారు. తెలంగాణ ప్రజలపై భారం మోపుతూ, వాస్తవాలను దాచిపెట్టి ప్రభుత్వాన్ని నడపడం సరికాదని హితవుపలికారు. నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.