మెదక్, మార్చి 16: నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజల కలసాకారమవుతున్నదని మెదక్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు ఎం.పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 7 జిల్లాల్లోని 7 లక్షల ఎకరాలకు నీరందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకున్నామన్నారు. బడ్జెట్ సమావేశాలు అనేక సమస్యలకు పరిష్కారం చూపేలా, సజావుగా జరిగాయన్నారు. పేదల సంక్షేమాన్ని కాంక్షించి అందరికీ ఆమోద యోగ్యంగా సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు. మెదక్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేయడంపై జిల్లా తరఫున సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. నియామకాల విషయంలో గతంలోనే 1.56 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 1.30 లక్షలు భర్తీ చేసుకున్నామన్నారు. తాజాగా 81వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారని, 11 వేల కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నారని అన్నారు. 95 శాతం స్థానికులకే ఉద్యోగావకాశాలు అందించాలని జిల్లాల వారీగా నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. మెదక్ జిల్లాకు 1149 పోస్టులు వస్తున్నాయని, జిల్లా యువత పోటీ పరీక్షలకు ఉచిత భోజన వసతితో శిక్షణ ఇవ్వనున్నామని అన్నారు.
బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ప్రధానంగా సెర్ప్, మెప్మా ఉద్యోగులకు భద్రత కల్పిస్తూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇస్తామని, ఉపాధి హామీ పథకం కింద ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నామని ప్రకటించారన్నారు. మధ్యాహ్న భోజన వంట పని వారికీ రూ.వెయ్యి నుంచి రూ.3 వేలకు పెంచారన్నారు. సీఎం కేసీఆర్ మనసున్న, మానవత్వమున్న మారాజని కొనియాడారు. వైద్య, విద్య రంగానికి పెద్దపీట వేసి జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేశారని, పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు దవాఖానల స్థాయిని పెంచి సిబ్బందిని ఏర్పాటు చేసి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారని అన్నారు. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మన ఊరు.. మన బడి కార్యక్రమం తీసుకొచ్చారని, దీనికింద ఈ ఏడాది 33 శాతం పాఠశాలలను ఎంపిక చేసి ఫర్నిచర్‌తో సహా ఇతర వనరులు సమకూరుస్తున్నారని అన్నారు. విద్యా విధానాన్ని పటిష్టపర్చడానికి అనేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నారన్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి 57ఏండ్లు పైబడిన అర్హులైన వారికి ఆసరా పింఛన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. సొంత జాగా ఉన్న వారు ఇల్లు కట్టుకుంటే రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, టీఆర్ఎస్ మెదక్ పట్టణ, హవేళీఘనపూర్ మండల అధ్యక్షులు గంగాధర్, శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు లింగారెడ్డి, రాగి అశోక్, జయరాంరెడ్డి, సాప సాయిలు తదితరులు పాల్గొన్నారు.