ఊట్కూర్ : ద్విచక్ర వాహనంపై వెళ్తూ రోడ్డు పక్కన నిలిపిన వడ్ల ట్రాక్టర్ను ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందాడు. మంగళవారం రాత్రి నారాయణపేట జిల్లా ( Narayanapet District ) ఊట్కూర్ మండలం ఓబులాపూర్ క్రాస్ రోడ్డు సమీపంలో జరిగిన ఘటన వివరాలను స్థానికులు, పోలీసులు వెల్లడించారు.
మండలంలోని శ్రీరాంనగర్ వీధిలో నివాసం ఉంటున్న కంసాని రాజు(40) నారాయణపేట పట్టణ సమీపంలోని హోటల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ద్విచక్ర వాహనంపై హోటల్ కు వెళ్లి రాత్రివేళ స్వగ్రామానికి తిరిగి వస్తుండగా గాయత్రి రైస్ ఇండస్ట్రీకి వడ్ల లోడుతో వచ్చిన వాహనాలు మెయిన్ రోడ్డుపై బారులు తీరాయి. ద్విచక్రవాహనదారుడు ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ట్రాలీని వెనక వైపు నుంచి బలంగా ఢీ కొట్టాడు. దీంతో అతడి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే రాజు ( Raju) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
మృతుడికి భార్య, నలుగురు కూతుళ్లు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై కృష్ణంరాజు తెలిపారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట జిల్లా దవాఖానకు తరలించామన్నారు. రాజు మృతితో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాన్ని మాజీ సర్పంచ్ సూర్య ప్రకాష్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ కొండన్ గోపాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగం, కొక్కు శంకర్ తదితరులు పరామర్శించారు.