Mumbai rains : మహారాష్ట్ర రాజధాని ముంబైని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. తాజాగా ముంబైలో భారీ వర్షం కారణంగా ఒక వ్యక్తి మ్యాన్‌హోల్‌లో పడి కొట్టుకుపోయాడు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ముంబైలోని చండివలి ఏరియాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చండివలి, సన్మాన్ హోటల్ సమీపంలోని ఖైరాని రోడ్డులో మెయింటెనెన్స్ వర్క్ జరుగుతోంది. ఈ క్రమంలో అక్కడ అస్లాం ఇసాక్ షేక్ (60) అనే వృద్ధుడు ఫోన్లో నడుచుకుంటూ వెళ్తుండగా, ప్రమాదవశాత్తు మ్యాన్‌హోల్‌లో పడిపోయాడు.
దీంతో అతడు ఆ మ్యాన్‌హోల్‌లో పడి కొట్టుకుపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సహాయక బృందాలు, అధికారులు అక్కడికి చేరుకున్నారు. దర్యాప్తు జరుపుతున్నారు. అతడి మృతదేహాన్ని వెలికితీసేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. మ్యాన్హోల్లోకి నిచ్చెన వేసి అతడి కోసం గాలించారు. కానీ, అతడి గొడుగు, చెప్పులు మాత్రమే కనిపించాయి. మ్యాన్‌హోల్‌లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల అతడు ఎటువైపు కొట్టుకుపోయాడో కచ్చితంగా చెప్పడం కష్టమని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు అన్నారు. అతడిని గుర్తించడం కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ అంశంలో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇటీవల వర్షాల కారణంగా ముంబైలో సంభవించిన మూడో మరణం ఇది.
మంగళవారం ముంబై, చెంబూర్‌లోని ఒక స్కూల్ బస్సుపై చెట్టు పడటంతో 11 ఏళ్ల బాలుడు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరికొందరు విద్యార్థులు గాయపడ్డారు. ఒక బిల్డింగ్ మూడో ఫ్లోర్ బాల్కనీ కూలిన ఘటనలో 51 ఏళ్ల మరో వ్యక్తి మరణించాడు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కొద్ది రోజులుగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కొన్ని చోట్ల 200 మి.మీ.వర్షపాతం నమోదైంది. అనేక చోట్ల నీళ్లు నిలిచిపోయాయి. ట్రాఫిక్ స్తంభించిపోయింది. ముంబైలో శుక్రవారం ఉదయం వరకు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.