Old Pension Scheme | 2004 సెప్టెంబర్ 1 కన్నా ముందు జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా నియమించబడిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు (ఐఏఎస్)కు గ్రూప్ 1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ ఉపాధ్యాయ, సచివాలయ ఉద్యోగులతో కలిసి వినతి పత్రం సమర్పించారు.
కేంద్ర ప్రభుత్వం, 2004 సెప్టెంబర్ 1 కన్నా ముందు జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా నియమితులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీం పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జీవో 53 ఈ నెల 13న జారీ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించినట్లు తెలిపారు. తెలంగాణ హైకోర్ట్ సైతం వీరికి పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలని ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో 2004 సెప్టెంబర్ 1 కన్నా ముందు జారీ చేసిన గ్రూప్-1, గ్రూప్-2 , డీఎస్సీ, ఎస్సై, కానిస్టేబుల్ తదితర ఉద్యోగులు 11 వేల మంది ఉంటారని కేంద్ర ప్రభుత్వం, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాల తరహాలో మన రాష్ట్రంలో కూడా వీరందరికీ పాత పెన్షన్ విధానం పునరుద్దరింప జేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చంద్రశేఖర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో 2003 ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాడవేడి వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఇమ్మడి సంతోష్ కుమార్, కోశాధికారి గుంటి వేణుగోపాల్, సలహాదారులు రెండ్ల రాజేష్, బి. స్వామి గౌడ్, శ్రీహరి, రవింధర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.