Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీ మళ్లీ రాజకీయంగా పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా చాలా కాలం తర్వాత ఇండియా బ్లాక్ సమావేశానికి మమత హాజరుకానున్నారు. ఇందుకోసం మమత ఢిల్లీకి బయల్దేరారు. సోమవారం ఈ సమావేశం జరగనుంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఈ సమావేశానికి నేతృత్వం వహించనుంది.
ప్రతిపక్షాల కూటమిగా ఉన్న ఇండియా బ్లాక్ ప్రస్తుతం భవిష్యత్ రాజకీయాలపై దృష్టిపెట్టింది. అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు వరుసగా ఓటమి చవిచూస్తున్నాయి. బీజేపీ చేతిలో పరాజయం పాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమావేశం కీలకం కానుంది. సమావేశానికి 23 పార్టీలు హాజరవుతాయని కాంగ్రెస్ వెల్లడించింది. టీఎంసీ ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీకి ఈ మీటింగ్ కీలకం కానుంది. అక్కడ బీజేపీ భారీ విజయం సాధించింది. ఇది రాజకీయంగా భారీ చర్చకు దారితీసింది. ఇటీవల ముగిసిన ఎన్నికల తర్వాత ఇండియా బ్లాక్ సమావేశం జరగడం ఆసక్తికరంగా మారింది. బీజేపీ రాజకీయంగా ఎదగడం ఆయా పార్టీలకు ఇబ్బందిగా మారింది.
ఇండియా కూటమిలో విబేదాల తర్వాత ఇంతకాలానికి అన్ని ఎక్కువ పార్టీలు ఏకమవుతున్నాయి. ఇండియా బ్లాక్ తన లక్ష్యాల్ని మళ్లీ నిలబెట్టుకోవాలని నిర్ణయించింది. ఇండియా బ్లాక్‌కు నాయకత్వం, సమన్వయం, రాబోయే ఎన్నికల్లో కలిసి పని చేయడంపై కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే, ఈ మీటింగ్‌కు డీఎంకే హాజరు కావడం లేదు. ఇంతకాలం డీఎంకే.. ఇండియా కూటమిలో కీలకంగా ఉంది. అయితే, కాంగ్రెస్ పార్టీ తమిళనాడులు డీఎంకేను కాదని టీవీకేకు మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ కాంగ్రెస్‌పై వ్యతిరేకతతో ఉంది. అందుకే, ఈ కూటమికి డీఎంకే దూరంగా ఉండనుంది.