హైదరాబాద్ : అద్భుతమైన ఆటతో సంచలనాలు సృష్టిస్తున్న చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ(Vaibhav ) తల్లిదండ్రులకు బీసీసీఐ(BCCI) అరుదైన ఆహ్వానాన్ని పలికింది. ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్ కోసం వైభవ్ తల్లిదండ్రులను కూడా రమ్మని రెక్వెస్ట్ చేసింది. ఈ సందర్భంగా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ..వైభవ్ ఇంకా 15 ఏండ్ల చిన్న పిల్లాడు. అతడు సీనియర్లతో కలువడానికి కొంత సమయం పడుతుందన్నారు. సాధారణంగా భారత జట్టు పర్యటనల సమయంలో ఆటగాళ్లతో పాటు వారి తల్లిదండ్రులను అనుమతించం. కానీ, ఓ ప్రత్యేక పరిస్థితుల్లో వైభవ్ కుటుంబానికి ప్రత్యేక అనుమతి ఇస్తున్నామని సైకియా తెలిపారు.
ఇండియా-ఏ జట్టు తరఫున శ్రీలంక పర్యటనకు వైభవ్ వెళ్తున్నాడు. అతడి తండ్రి కూడా వెళ్తున్నాడు.
అలాగే ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనకు కూడా సూర్యవంశీ పేరెంట్స్ వెళ్తే తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. వైభవ్ పెద్ద వాళ్లతో కలువడానికి కొంత సమయం పడుతుందని ఈ సమయంలో వారి తల్లిదండ్రులు అతడి వెంట ఉండటం శ్రేయస్కరమని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని సైకియా తెలిపారు.
వారికి ఇష్టం ఉంటే వెళ్తేనే బాగుంటుందని ఇప్పటికే వైభవ్ కుటుంబానికి సమాచారం చేరవేశామన్నారు. కాగా, తన కెరీర్లో మొదటిసారిగా సీనియర్ జట్టులో భాగం కాబోతున్న యువ ఆటగాడు వైభవ్ కోసం BCCI ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 16 ఏళ్ల 207 రోజుల వయసులో అరంగేట్రం చేసిన సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును అధిగమించి, భారత్ తరపున అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా వైభవ్ నిలిచే అవకాశం ఉంది. మరోవైపు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సైతం వైభవ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. తన ప్రతిభే తనను జాతీయ జట్టుకు ఎంపిక చేసిందని పేర్కొన్నాడు.