న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ఎన్నికల కమిషన్‌పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేక సమగ్ర సమీక్ష (సర్) సందర్భంగా భారీస్థాయిలో ఓటర్ల తొలగింపు జరిగిందని ఆరోపిస్తూ సోమవారం ఇక్కడి ఈసీ ప్రధాన కార్యాలయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ ఏజెంట్లా ఎన్నికల కమిషన్ పనిచేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బెంగాల్‌లోని సర్ బాధితులను వెంటపెట్టుకుని సీఈసీని కలసిన మమత చిన్న చిన్న అక్షర దోషాలు, ఇంటిపేర్ల మార్పులను సాకుగా చూపించి ఓటర్ల వాదనను కూడా పట్టించుకోకుండా పేర్లను తొలగించడంపై అభ్యంతరం తెలిపారు. ఎన్నికల కమిషనర్ బీజేపీ ఐటీ సెల్ మనిషి. దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? అంటూ ఆమె మండిపడ్డారు. విచారణ జరపకుండా 58 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించారని ఆమె ఆరోపించారు. సీఈసీతో సమావేశాన్ని చివరన బహిష్కరించినట్లు ఆమె తెలిపారు. జ్ఞానేశ్‌కుమార్ అహంకారి, అబద్ధాలకోరు అని మండిపడ్డారు. తమను అవమానించారని ఆమె ఆరోపించారు.