నగరంలో మెట్రో విస్తరణ అడకత్తెరలో పోక చెక్కలా మారింది. రాష్ట్ర సర్కారు తొందర పాటు నిర్ణయం..డీపీఆర్ రూపకల్పనలో తలెత్తిన లోపాలు.. అటు కేంద్రం వద్ద తేల్చుకోలేక..ఇటు రాష్ట్ర ప్రజలకు చెప్పుకోలేని పరిస్థితి నెలకొన్నది. ఇక మెట్రోకు నిధులైనా వస్తాయని భావిస్తే.. అతీగతి లేకుండా పోతున్నది. నిధులే కావాలంటే… ముందుగా ఎల్ అండ్ టీ సంస్థతో ఉన్న చిక్కుముడిని తేల్చుకోవాలని.. అప్పటివరకు నిధుల ముచ్చట ఉండదని కేంద్రం చెబుతున్నది. ఇదంతా చూస్తుంటే నగరంలో మెట్రో విస్తరణ త్రిశంకు స్వర్గంగా మారేలా ఉన్నది. సొంత నిధులతోనైనా ప్రాజెక్టులను చేపట్టడానికి కూడా అనుమతులు అనివార్యం కావడంతో మెట్రో విస్తరణ ఇప్పట్లోనే అసాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
-సిటీబ్యూరో
మెట్రో విస్తరణపై రాష్ట్ర సర్కారు ఊరించిన తీరు… ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు వేర్వేరుగా ఉన్నాయి. తొలుత ప్రాజెక్టు డీపీఆర్‌ను ఆమోదించనీ సర్కారు… తాజా బడ్జెట్లో నిధుల కేటాయింపులపై రాష్ర్టాన్ని విస్మరించింది. ఇక నిధుల విషయానికి వచ్చే సరికి స్వాధీనం పూర్తయ్యేంత వరకు రూపాయి కూడా ఇవ్వలేమని తేల్చి చెప్పింది. అప్పటివరకు నగరంలో మెట్రో విస్తరణ అంశాన్ని తీసుకురావద్దని, ముందుగా ఆ ప్రక్రియ పూర్తి చేసుకోవాలంటున్నది.
మెట్రో విస్తరణ విషయంలో రూపొందించిన డీపీఆర్‌పై కేంద్రానికి ఉన్న అనుమానాలు, ప్రస్తుతం నిర్వహణ చేస్తున్న ఎల్ అండ్ టీతో ఉన్న వివాదాలు ప్రాజెక్టు విస్తరణకు అడ్డంకిగా మారాయి. దీంతోనే ముందుగా ఆ సంస్థతో ఉన్న ఒప్పందంపై క్లారిటీ వచ్చేంత వరకు కొత్త ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వలేమని కేంద్రం మెలిక పెట్టింది. ఇందులో సర్కారు అనుభవరాహిత్యం, వివాదాల పరిష్కారంలో రాష్ట్ర సర్కారులో లోపించిన చొరవ కేంద్రానికి అవకాశంగా మారిందనే విమర్శలు ఉన్నాయి.
స్వాధీనంతో ముడివేసిన కేంద్రం
తాజా బడ్జెట్లో మెట్రోకు ప్రత్యేకంగా నిధులేవి ఉండవని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి.. ముందుగా స్వాధీనంలో ఉన్న ఇబ్బందులను మరోసారి నొక్కి చెప్పారు. ఆ సంస్థతో తెగదెంపుల అంశం ఆర్థిక పరమైన ఒప్పందం కావడంతో… అప్పటివరకు మెట్రో విస్తరణకు అనుమతులు, నిధులు ఇవ్వలేమని వెల్లడించారు. ఇక కేంద్రం వద్ద నిధులకు ఢోకా లేదని, అవసరమైన నిధులను మంజూరు చేస్తామంటూనే, రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపింది. మెట్రో విస్తరణకు ఎల్ అండ్ టీతో వచ్చే ఇబ్బందులపై అవగాహన, అంచనాలు లేకుండానే కేంద్రానికి డీపీఆర్‌ను అప్పగించిన రాష్ట్ర సర్కారు కారణంగా మరిన్ని సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఒకేసారి ఎల్ అండ్ టీకి రూ. 15వేల కోట్లు సర్దుబాటు చేసుకోలేక, ప్రాజెక్టుకు అనుమతులు, నిధులివ్వాలని డిమాండ్ చేయలేకపోతుంది. దీంతోనే నగరంలో మెట్రో విస్తరణ మరింత జాప్యం కానున్నది.