Mamata Banerjee : పశ్చిమబెంగాల్ (West Bengal) లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ ఓడిపోవడంతో అంతర్గత విభేదాలు మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఓటమిపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జి (Mamata Benerjee) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో టీఎంసీ తరఫున పోటీచేసిన అభ్యర్థులతో ఆమె ఖాళీఘాట్‌లోని తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె.. పార్టీలో ఉండాలనుకునేవాళ్లు ఉండవచ్చని, వద్దనుకునేవాళ్లు వెళ్లిపోవచ్చని అన్నట్లు టీఎంసీ వర్గాలు తెలిపాయి. పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మమత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఈ సమావేశంలో టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పార్టీ మళ్లీ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. పార్టీ నుంచి వెళ్లాలనుకునేవారు వెళ్లిపోవచ్చని, తాను పార్టీని మళ్లీ కొత్తగా నిర్మిస్తానని అన్నారు. పార్టీలోనే ఉండాలని అనుకునేవాళ్లు ప్రత్యర్థుల చేతిలో దెబ్బతిన్న పార్టీ కార్యాలయాలను పునర్నిర్మించాలని పిలుపునిచ్చారు. కార్యాలయాలను పునర్నిర్మించి రంగులు వేయాలని సూచించారు. అవసరమైతే తాను కూడా స్వయంగా పార్టీ కార్యాలయాలకు రంగులు వేస్తానని చెప్పారు. టీఎంసీ ఎప్పటికీ తల వంచదని చెప్పారు. ప్రజల తీర్పును బీజేపీ దొంగిలించిందని విమర్శించారు.
తృణమూల్ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలను పంచుకుంది. ఆ పోస్టుకు ‘టీఎంసీ ఒక కుటుంబంలా ఐక్యంగా నిలుస్తుంది. ప్రజల తీర్పును దోచుకునే వారి ముందు మేం ఎప్పటికీ తలవంచం. సత్యమే గెలుస్తుంది’ అని క్యాప్షన్ రాసింది. కాగా బెంగాల్లో మొత్తం 294 స్థానాలకు ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. 3 దఫాలుగా అధికారంలో ఉన్న టీఎంసీ కేవలం 80 సీట్లనే గెలుచుకుంది. మమతకు కంచుకోట అయిన భవానీపూర్‌లో ఆమె ఓటమి పాలయ్యారు.