MP DK Aruna | వరంగల్ : పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ సవాల్ విసిరారు. వరంగల్- ఖమ్మం- నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హనుమకొండకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తన 14 నెలల పాలనపై తనకు తాను డబ్బా కొట్టుకోవడం కాదని ఎద్దేవా చేశారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో గెలవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ సర్కారు పాలనపై ప్రజల తీర్పు తెలుస్తుందని అన్నారు. ఎన్నికల ముందు అబద్ధపు 6 గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఎన్నికలలో ఉపాధ్యాయ వర్గానికి ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలును పట్టించుకోవడంలేదని విమర్శించారు.
రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల నిధులను మంజూరు చేస్తున్నది అన్నారు. ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చుకుందన్నారు. ఈ ప్రెస్ మీట్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి, మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, బీజేపీఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
Maha Kumbh | 41 రోజులు.. 60 కోట్ల మంది పుణ్యస్నానాలు.. చివరి దశకు మహాకుంభమేళా
Crime news | బస్ కండక్టర్పై అమానుషం.. మరాఠీ మాట్లడలేదని మూకుమ్మడి దాడి