జయశంకర్ భూపాలపల్లి, మే 1 (నమస్తే తెలంగాణ) : మక్కజొన్న రైతులకు కాంగ్రెస్ సర్కారు నుంచి భరోసా కరువై దుఃఖిస్తున్నారు. పండించిన పంటను అమ్ముకోవడానికి రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. పంట చేల వద్ద, రోడ్లపైనా, కొనుగోలు కేంద్రాల్లో మక్కలను ఆరబోసి, విక్రయించేందుకు పడిగాపులు కాస్తున్నారు. ఆయా సెంటర్లలో అడపా దడపా కొనుగోలు చేస్తూ మళ్లీ బ్రేక్ ఇస్తున్నారు. లారీలు రావు.. గన్నీ సంచుల పంపిణీ ఉండదు.. సర్కారు వైఖరితో నెలరోజులుగా జిల్లాలో రైతులు అరి గోసపడుతున్నారు. జిల్లాలో నెలరోజుల క్రితం అధికారులు ఏడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరో 5 కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, మరిచిపోయారు.
మొత్తం 39,500 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఏడు సెంటర్ల ద్వారా కేవలం 3 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే అతికష్టం మీద కొనుగోలు చేశారు. కొనుగోలు చేసి నెల కావొస్తున్నా ఇంతవరకు రైతులకు డబ్బులు అందలేదు. ఒక్కో గన్నీ సంచికి రూ.30 వెచ్చించి కొనుగోలు చేసిన రైతులకు సంచుల డబ్బుల చెల్లింపు ఊసే లేదు. ఇదిలాఉండగా ఎకరంలో సుమారు 35 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా, అధికారులు ఎకరాకు కేవలం 26 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని కొర్రీలు పెడుతున్నారు. దీంతో రైతులు తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం మక్కల కొనుగోలులో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుండడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఎండలు మండిపోతుండడంతో మక్కజొన్న చేలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి.
కొనుగోలు కేంద్రాల ద్వారా రూ. 2400 మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నట్లు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా, ఆచరణలో అమలు కావడం లేదు. సర్కారు నిర్లక్ష్యంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు రూ.1800కే అమ్ముకుంటూ ఆర్థికంగా నష్టపోతున్నారు. జిల్లాలోని మొగుళ్లపల్లి, రేగొండ, గోరుకొత్తపల్లి, గణపురం, గొర్లవీడు, చిట్యాల, టేకుమట్ల లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంథిని నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఇప్పటి వరకు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. 39,500 మెట్రిక్ టన్నుల మక్కల కొనుగోలుకు గాను 590 మంది రైతుల నుంచి కేవలం 3వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. కానీ, ఇప్పటివరకు డబ్బులు చెల్లించలేదు. ట్రాన్స్‌పోర్టేషన్ టెండర్ దశలో ఉందని, గన్నీ సంచుల సరఫరాకు వ్యాపారులు ముందుకు రావడం లేదని, 26 క్వింటాళ్ల నిబంధన సర్కారు విధించడంతో తాము పాటిస్తున్నామని, పెద్దపల్లిలో గోదాముల వద్ద అన్‌లోడింగ్‌లో చాలా జాప్యం జరుగుతున్నదని మార్క్‌ఫెడ్ అధికారులు తెలుపుతున్నారు.
రైతులు పండించిన మక్కజొన్నను ప్రభుత్వం సకాలంలో కొనకపోవడంతో రైతులు కోయకుండా చేలలోనే ఉంచుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తో, విద్యుత్ ప్రమాదాలు జరిగో పంట మొత్తం ఆగ్నికి ఆ హుతై రైతులు నష్టపోతున్నారు. మొగుళ్లపల్లి మండలం పెద్దకోమటిపల్లి, గణేశ్‌పల్లి గ్రామాల మధ్య గతనెల 26న సుమారు 9 మంది రైతులకు చెందిన 17ఎకరాల మక్కజొన్న పంటకు నిప్పంటుకొని కాలిబూడిదైంది. ఇది జరిగి వారం గడువకముందే టేకుమట్ల మండలం రామక్రిష్టాపూర్ గ్రామంలో బోయ రమేశ్‌కు చెందిన మూడు ఎకరాల పంట మంటల్లో కాలిపోయింది. తాజాగా, శుక్రవారం మళ్లీ మొగుళ్లపల్లి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో సుమారు 17 ఎకరాల్లో మక్కజొన్న పంట కాలిపోయింది. చేతికొచ్చిన పంట మంటల్లో కాలిపోతుండడంతో రైతులు విలపిస్తున్నారు.
ప్రభుత్వం మక్కల కొనుగోళ్లను నిర్లక్ష్యం చేస్తున్నది. గన్నీ సంచులు ఇవ్వడం లేదు. మమ్మల్నే కొనుక్కోమంటున్నది. కల్లంలో పోసిన మక్కలను అమ్మేందుకు చాలా రోజులు పడుతున్నది. లారీలు రావడం లేదు. ఎకరాకు 26 క్వింటాళ్లే కొంటరట. మిగిలింది ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకునుడే. తప్పేలా లేదు. కొన్న మక్కలకు కూడా డబ్బులు రావడం లేదు. నేను మూడు ఎకరాలు మక్కజొన్న వేసిన. 1.20క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. 78 క్వింటాళ్లు మాత్రమే కొంటరట. మక్కలను ఆరబోసుకొని రేయింబవళ్లు కాపలా కాయాల్సి వస్తుంది. వర్షాలు పడితే మా పరిస్థితి ఏంటి?
– బుర్ర దేవెందర్ గౌడ్, రైతు, చిట్యాల