అందమైన కలగా సాగిపోతున్న ఆమె జీవితంలో ఓ కలత రేగింది. అర్థం చేసుకునే భర్త, ముచ్చటైన పిల్లలున్నా.. ఏదో వెలితి ఆమెను కుంగదీసింది. శారీరకంగానూ ఇబ్బందిపెట్టింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదు. మానసిక ఒత్తిడిని జయించడానికి ఆమె ఓ కళను నమ్ముకుంది. అదే ‘మండల ఆర్ట్’. రుషుల కాలం నుంచి ఉన్న ఈ అరుదైన కళలో పట్టు సాధించింది. ఒత్తిడిని అధిగమించింది. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత.. ఈ కళను పదిమందికీ నేర్పుతున్నది చుండూరు మైత్రేయి. ఒత్తిడితో సతమతమవుతున్న వారికి శిల్పారామం వేదికగా మండల ఆర్ట్‌ని నేర్పిస్తూ.. అందరిలో నూతనోత్సాహాన్ని నింపుతున్న మైత్రేయి జిందగీతో పంచుకున్న సంగతులు ఆమె మాటల్లోనే..

దేహానికి రోగాలొస్తే… మందులతో నయం చేసుకోవచ్చు. మానసిక రోగాలు అంటుకుంటే.. వాటిని తగ్గించుకోవడానికి మనల్ని మనం మార్చుకోవాల్సిందే! నా కథ కూడా అలాంటిదే!! అర్థం చేసుకునే భర్త, ఆనందం పంచే పిల్లలతో హాయిగా సాగిపోతున్న జీవితంలోకి ఒత్తిడి ప్రవేశించింది. తెలియని మానసిక ఒత్తిడి నన్ను నానాటికీ కుంగదీయసాగింది. దాన్నుంచి బయటపడేందుకు, నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునేందుకు నేను ఎంచుకున్న మార్గం మండల ఆర్ట్.
నేను పుట్టింది, పెరిగింది వరంగల్‌లో. అమ్మానాన్న ఇద్దరూ ఉద్యోగులే. అన్ని రకాలుగా ప్రోత్సహించేవాళ్లు. బాగా చదివేది. హస్త కళలపై ఆసక్తి ఉండేది. డిగ్రీ తర్వాత వివాహమైంది. మా ఆయన బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తారు. ఇద్దరు పిల్లలతో హాయిగా సాగుతున్న మా జీవితంలో ఊహించని ఉపద్రవం ఎదురైంది. 2014లో నా కుడికన్ను, నోరు చలనం లేకుండా అయిపోయాయి. వైద్యులను సంప్రదిస్తే.. ‘బెల్స్ పాల్సీ’ వ్యాధి వచ్చిందని చెప్పారు. ఇది చాలా అరుదుగా వచ్చే రుగ్మత. అధిక ఒత్తిడికి గురయ్యేవారికి, నిద్రలేమితో బాధపడేవారికి సంక్రమించే ఈ జబ్బు నాకు ఎందుకు వచ్చిందో అస్సలు అర్థం కాలేదు. ఎన్ని రకాల చికిత్సలు చేయించుకున్నా, కౌన్సెలింగ్‌లు తీసుకున్నా పూర్తిస్థాయిలో గుణం కనిపించలేదు.
ఇక నా జీవితం ఇంతేనా అనుకుని కుమిలిపోయాను. అదే సమయంలో ఈ రుగ్మత గురించి గూగుల్‌లో వెతకడం మొదలుపెట్టాను. మానసిక ఒత్తిడి వల్ల కలిగే ఈ రుగ్మతకు ఇతర దేశాల్లో ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో సెర్చ్ చేశాను. దీనికి విరుగుడు ఏంటో తెలుసుకోగలిగాను. అలా పరిచయమైందే ‘మండల’ ఆర్ట్. భారతీయ (హిందూ), టిబెటన్ (బౌద్ధ) సంప్రదాయాల నుంచి పుట్టిన ఆధ్యాత్మిక, ప్రతీకాత్మక కళ ఇది. ‘మండల’ అంటే సంసృతంలో ‘వృత్తం’ అని అర్థం. విశ్వాన్ని, సమగ్రతను, ఐక్యతను సూచించే క్లిష్టమైన జ్యామితీయ ఆకారాలతో ఈ ఆర్ట్ ఉంటుంది.
ఇది ఒక సృజనాత్మక కళ మాత్రమే కాదు. మనలోని ఒత్తిడిని తగ్గించి, మనసును ప్రశాంతంగా ఉంచడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సాయపడే ఒక శాస్త్రీయ పద్ధతిగా దీనికి పేరుంది. విభిన్నమైన ఆకృతులను ఆవిష్కరించే క్రమంలో తెలియకుండానే గంటలు గడిచిపోతాయి. అదే సమయంలో మనలో పేరుకుపోయిన ఒత్తిడి కూడా తగ్గుముఖం పడుతుంది. చిన్నప్పటి నుంచే కళలపై అభిరుచి ఉండటంతో మండల ఆర్ట్ సులువుగానే నేర్చుకున్నాను. పది నెలల పాటు మండల ఆర్ట్ థెరపీని కొనసాగించాను.

మొదట్లో ఈ ఆర్ట్‌ని పేపర్‌పై ప్రాక్టీస్ చేసేదాన్ని. ప్రతిరోజు ఏకాంతంగా నాలుగైదు గంటలపాటు శ్రమించేదాన్ని. నా ఆరోగ్యం కుదుటపడగానే క్యాన్వాస్, ఎండీఎం బోర్డ్‌పై వేయడం ప్రారంభించా. ఒకరోజు ఇలా ఆర్ట్ వేస్తున్న సమయంలో తన బంధువుల పెళ్లికి పిలిచేందుకు నా స్నేహితురాలు మా ఇంటికి వచ్చింది. నా పెయింటింగ్స్ చూసింది. అవి బాగా నచ్చడంతో డబ్బులు ఇచ్చి మరీ ఆ పెండ్లిలో బహూకరించడానికి కొన్ని ఆర్ట్స్ తీసుకెళ్లింది.
ఇక అప్పటినుంచి పరిచయం ఉన్నవారు అడిగినప్పుడల్లా వారికి విక్రయించేదాన్ని. ఆదాయం అని కాకుండా అందులోనే నా ఇష్టాన్ని ఏర్పరుచుకున్నా. 2022 వరకు నేను వేసిన మండల ఆర్ట్స్‌ను శిల్పారామంలో జరిగే కార్యక్రమాల్లో ప్రదర్శించడానికి నిర్వాహకుల అనుమతి కోసం వారిని సంప్రదించాను. నా పెయింటింగ్స్ కొత్తగా ఉండటంతో అక్కడి అధికారులు ‘మీరు ఇక్కడికి వచ్చే వారికి ట్రైనింగ్ ఇవ్వండి. వసతి కల్పిస్తాం’ అని చెప్పారు. చాలామంది
మానసిక ఒత్తిళ్లకు గురవుతూ ఉంటారు. వారికి ఈ ఆర్ట్ ఒక మెడిసిన్‌లా పనిచేస్తుంది. ఇలాంటి ఆర్ట్‌ను నలుగురికీ నేర్పించడం అవసరం అనిపించింది. అందుకే వెంటనే ఓకే చెప్పాను. ఆనాటి నుంచి శిల్పారామంలో మండల ఆర్ట్ ప్రస్థానం మొదలైంది.
ప్రతి శని, ఆదివారాలు సాయంత్రం నాలుగు నుంచి ఏడు గంటల వరకు శిల్పారామంలో ఉచిత సెషన్ నిర్వహిస్తున్నా. మానసిక ఒత్తిడిలో ఉన్నవారు, నిద్రలేమితో బాధపడేవారు వచ్చి ఈ ఆర్ట్ ద్వారా ఊరట పొందారు. బ్యాచ్‌కి 20 మంది చొప్పున క్లాస్‌లు చెబుతున్నాను. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా వస్తున్నారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగిణులు ఆసక్తిగా ఆర్ట్ నేర్చుకుంటూ.. ఒత్తిడిని జయిస్తున్నారు. ఏకాగ్రతతో మండల ఆర్ట్ వేయడం వల్ల.. మనసును అలుముకున్న చికాకులు దూరమవుతాయి.
గడిచిన మూడేండ్లలో దాదాపు 370 మంది నా దగ్గర శిక్షణ తీసుకున్నారు. వారిలో కొందరు దీనిని తమ పార్ట్‌టైమ్ వృత్తిగా మలుచుకున్నారు. అరుదైన ఈ కళతో నా ఆరోగ్యం పూర్తిస్థాయిలో మెరుగుపడింది. ఔషధాలకు లొంగని జబ్బు ఈ కళతో తగ్గిపోయింది. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటున్నది. ఒత్తిడి లేని సమాజం కోసం మండల ఆర్ట్‌కు మరింత ప్రచారం కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నా. ఈ ఆర్ట్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న 18 ఏళ్లు పై పడినవాళ్లు 99634 67064 నంబర్‌ను సంప్రదించొచ్చు.
ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన ‘వివిధ్ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వివిధ రంగాలనుంచి 22 మంది కళాకారులు హాజరయ్యారు. నాకు కూడా అందులో పాల్గొనే అవకాశం దొరికింది. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము నా దగ్గరికి వచ్చి పెయింటింగ్స్‌ని నిశితంగా పరిశీలించారు. వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు, రాష్ట్రపతి ఆర్ట్ గ్యాలరీలో నా పెయింటింగ్స్‌కు చోటివ్వడం మరచిపోలేని అనుభూతి.
– రాజు పిల్లనగోయిన
– చిన్నయాదగిరి గౌడ్