తండ్రి సేద్యం… తల్లి స్వేదం.. ఆమెకు తెలుసు! నెర్రలు వారిన నేల గుర్తుంది. అందివచ్చిన అవకాశం చేజారడమూ యాదికుంది. ఆ కష్టనష్టాలకు విరుగుడు పట్టుదలతో చదవడమే అనుకుంది.విజయం తనదే అని యుద్ధం చేసింది. అనుకున్నట్టుగానే గెలిచింది. యూపీఎస్సీ కంబైన్డ్ జియో సైన్స్-2025 పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంకింగ్‌లో 29వ స్థానం సాధించి హైడ్రో జియాలజిస్ట్‌గా కేంద్ర సర్కార్ కొలువు కొట్టిన
వట్టిపల్లి మట్టిబిడ్డ తప్పెట్ల సంధ్య గెలుపు కథ ఆమె మాటల్లోనే..
మాది సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలంలోని వట్టిపల్లి గ్రామం. మాకున్న కొద్దిపాటి పొలంలోనే తిండి గింజల కోసమని నాన్న సత్యనారాయణ వరి పండించేవాడు. ఇల్లు గడవడం కోసం అమ్మ లక్ష్మి కూలీ పనులకు వెళ్తుండేది. నాకో చెల్లి ఉంది. ప్రస్తుతం తను మెడికల్ కోడింగ్ నేర్చుకుంటుంది. నా పాఠశాల చదువంతా మా ఊరిలోని ప్రభుత్వ పాఠశాలలోనే సాగింది. పదో తరగతి వరకు తెలుగు మీడియంలో చదువుకున్నా. ఇంటర్ కోసం ములుగులో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చేరాను.
నాకు సైన్స్, లెక్కలు అంటే ఆసక్తి. ఫిజిక్స్ అంటే మరీ ఇష్టం. ఆకాశం నీలంగానే ఎందుకుంటది? లాంటి ప్రశ్నలకు నిత్యం సమాధాలను వెతికేదాన్ని. అందుకే నాకిష్టమైన రెండు సబ్జెక్టులు కలిసిన ఎంపీసీ తీసుకున్నా. రెండేండ్లు హాయిగా సాగింది. ఇంగ్లిష్ కూడా నేర్చుకున్నా. ఆ సమయంలో గురుకులాల కార్యదర్శిగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సార్ మా అందరితో హయ్యర్ ఎడ్యుకేషన్ క్యాంప్ నిర్వహించారు. పై చదువుల కోసం దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో ప్రవేశం కోసం పరీక్ష రాయించారు. అందులో నాకు పుదుచ్చెరీ యూనివర్సిటీలో సీటొచ్చింది. నాకు ఇష్టమైన ఎంఎస్సీలో ఇంటిగ్రేటెడ్ కోర్సులో చేరాను.

ఎప్పుడూ మా జిల్లా దాటి బయటికి వెళ్లింది లేదు. అలాంటిది రాష్ర్టాలు దాటాలంటే భయమేసింది. కానీ, అందివచ్చిన అవకాశం వదులుకోవడం ఇష్టంలేక వెళ్లాను. అక్కడి వాతావరణం నన్ను పూర్తిగా మార్చేసింది. మంచి గురువులు ఉండేవారు. రోజూ కొత్త విషయాలు నేర్చుకునేదాన్ని. చర్చా వేదికలు నిరంతరం సాగేవి. అలా నా ఇంటిగ్రేటెడ్ కోర్స్ విజయవంతంగా కొనసాగింది. పీజీలో జియాలజీ తీసుకున్నా. ఫైనల్ ఇయర్లో ఉన్నప్పటి నుంచి పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ ప్రారంభించా. 2023లో యూపీఎస్సీ విడుదల చేసిన కంబైన్డ్ జియోసైన్స్ నోటిఫికేషన్ చూశా. కాలేజ్‌లో ఫ్రెండ్స్ ఐప్లె చేస్తుంటే నేను కూడా దరఖాస్తు చేశాను. కాలేజ్‌లో ఉండే ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్, మెయిన్స్‌లలో మంచి స్కోర్ సాధించాను. కానీ ఇంటర్వ్యూలో విఫలమయ్యాను. ఆ ప్రభావం నాపై బాగానే పడింది. అందివచ్చిన అవకాశం చేజారిపోయిందని చాలా బాధపడ్డా. పీజీ పూర్తికాగానే ఇంటికి వచ్చేశాను.
చాలారోజుల తరువాత ఇంటికొచ్చిన ఆనందం కంటే సర్కార్ కొలువు మిస్సయిందని బాధే నాలో ఉండేది. ఎలాగైనా తిరిగి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నా. కానీ, ఇంట్లో పరిస్థితి వేరేలా ఉంది. ప్రభుత్వోద్యోగం సాధించాలంటే పోటీ పరీక్షల్లో గెలవాలి. అందుకు కోచింగ్ తీసుకోవాలి. ఆర్థికంగా కోచింగ్ తీసుకునే పరిస్థితి లేదు. స్నేహితులను సంప్రదిస్తే.. హైదరాబాద్‌లోని అశోక్ నగర్ చదువుకునేందుకు అనువైన ప్రదేశమని సలహా ఇచ్చారు. వాళ్ల మాట విని వెళ్లినా.. అక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోయాను. కష్ట సమయంలో నాకు యూజీసీ నెట్ ఒక వరంలా వచ్చింది.
2024లో యూజీసీ నెట్లో జూనియర్ రిసెర్చ్ ఫెలోషిఫ్ (జేఆర్ఎఫ్)కు అర్హత సాధించాను. అలా ఉస్మానియా యూనివర్సిటీలో జియోలజీలో అడ్మిషన్ తీసుకున్నా. యూజీసీ ప్రతి నెలా అందించే రూ.37వేల ఫెలోషిఫ్తో పాటు హెచ్ఆర్ఏ నా కొలువుకు మార్గం చూపించాయి. ఆర్థికంగా కొంత వెసులుబాటు దొరికింది. ఇక గదిలోనే నా కసరత్తు ప్రారంభించాను. అదే సమయంలో యూపీఎస్సీ మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏ టెన్షన్ లేకుండా కష్టపడి చదివాను.
ప్రిపరేషన్ ప్రారంభించిన రోజే… ఈసారి విజయం నాదేనని యుద్ధానికి సిద్ధమయ్యా. ఆ సక్సెస్‌ను ఆస్వాదిస్తూ చదివాను. గతంలో నేను చేసిన తప్పులన్నీ నోట్ చేసుకొని ఒక్కొక్కటిగా అధిగమించాను. ఈ ప్రిపరేషన్లో నాకు నేనే కోచింగ్ సెంటర్ అని భావించా. రోజూ 13 గంటలు చదివేదాన్ని. యూట్యూబ్‌లో క్లాస్‌లు వినేదాన్ని. యూనివర్సిటీ ప్రొఫెసర్ల సలహాలు తీసుకునేదాన్ని. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రిలిమ్స్, జూన్‌లో మెయిన్స్ విజయవంతంగా పూర్తి చేశాను. గత సెప్టెంబర్ 26న ఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాలయంలో విజయవంతంగా ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆల్ ఇండియా ర్యాంకింగ్‌లో 29వ స్థానంలో నిలిచాను. అలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమైన హైడ్రో జియాలజిస్ట్ కొలువు సాధించాను.

చిన్పప్పుడు పొలం పారించేందుకు రైతులు పడుతున్న కష్టాలను చాలా దగ్గరనుంచి చూశాను. భూగర్భ జలాలు తగ్గడంతో బావులు, బోర్లు ఎండిపోయి పంట పొలాలన్నీ బీడువారిన గడ్డు పరిస్థితులు నాకింకా గుర్తు. చిన్నపిల్లనైనా ఇలాంటి సమస్యకు నేను ఏదైనా చేస్తే బాగుండు అనుకునేదాన్ని. బడిలో సార్లను అడిగేదాన్ని. తెలిసీ తెలియని వయసులో ఆనాడు అనుకున్న ఆలోచనలే నేడు భూగర్భ జలాల పరిరక్షణలో భాగమైన ఈ కొలువును సాధించేలా చేశాయి. నా ఆలోచనలు నీటి సంరక్షణకు తోడవుతాయని నమ్ముతున్నా.
ఉద్యోగం సాధించాలనే తపన అందరిలోనూ ఉంటుంది. కానీ, సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లే చాలామంది విఫలమవుతుంటారు. మొదటిసారి నేను కూడా అలాంటి తప్పులే చేశా. రెండు పడవల మీద ప్రయాణం సాధ్యం కాదు. అందుకే ఒకే లక్ష్యాన్ని ఎంచుకోవాలి. దాన్ని సాధించడానికి అహరహం కష్టపడాలి. నా సక్సెస్ సీక్రెట్ కూడా అదే! ప్రారంభంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు రావడం వల్ల.. చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేశాను. కానీ, తాత్కాలిక అవసరాల కోసం లక్ష్యాన్ని వదులుకోవద్దని బలంగా నిర్ణయించుకున్నా! చివరికి విజయం నన్ను వరించింది.
మా ఇంట్లో ఇప్పటివరకు ప్రభుత్వ కొలువు సాధించినవాళ్లు ఎవరూ లేరు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించిన తొలి వ్యక్తిని నేనే. నా సక్సెస్‌లో మా అమ్మది ప్రత్యేక స్థానం. ఇంట్లో బియ్యం లేకున్నా.. తన కూలీ పైసలు మా పుస్తకాల కోసం దాచిపెట్టేది. ఇక మా బంధువుల్లో ప్రభుత్వ టీచర్లు యాదగిరి, రమేశ్, పోలీస్ ఉద్యోగం సాధించిన మహేశ్, లావణ్య నాకు స్ఫూర్తి. వాళ్లను చూసి మా అమ్మ ‘నువ్వు కూడా వాళ్లలాగా సర్కార్ కొలువు సాధించాలి బిడ్డా’ అనేది.
– రాజు పిల్లనగోయిన