ముంబై, సెప్టెంబర్ 8: యుటిలిటీ వాహన తయారీలో అగ్రగామి సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా..లైట్ కమర్షియల్ వాహన సెగ్మెంట్‌ను మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా మరో మాడల్‌ను పరిచయం చేసింది. వీరో రేంజ్ విస్తరించడానికి నూతన వీరో 1.1 ఎక్స్ఎక్స్ల్ సీఎన్జీ , వీరో డీజిల్‌ను అప్‌గ్రేడ్ చేసి మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మినీ ట్రక్కు ప్రారంభ ధర రూ.8.25 లక్షలుగా నిర్ణయించిన సంస్థ..గరిష్ఠంగా రూ.9.45 లక్షలకు లభించనున్నది.
రెండేండ్ల క్రితం దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన వీరో బ్రాండ్నకు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో ప్రస్తుతం సరికొత్త మాడళ్లను ప్రవేశపెడుతున్నది. సీఎన్జీ మాడల్ కిలోకు 21.4 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది. సరికొత్త డీజిల్ మాడల్‌లో టచ్‌స్క్రీన్, పవర్ విండోస్, డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్, రివర్స్ పార్కింగ్ కెమెరాతోపాటు 50కి పైగా ఫీచర్లు ఉన్నాయి. నయా డీజిల్ రకం మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ అవుట్లెట్ల వద్ద లభించనుండగా, సీఎన్జీ మాడల్ మాత్రం ఈ నెల 20 నుంచి లభించనున్నది.