వాషింగ్టన్, సెప్టెంబర్ 8 : రానున్న మధ్యంతర ఎన్నికల్లో యూఎస్‌లోని ఇండో అమెరికన్లు అధికార డెమెక్రాటిక్ పార్టీ వైపే మద్దతు చూపిస్తున్నారు. ఆసియా, పసిఫిక్ ద్వీప అమెరికన్ వర్గాలపై జరిపిన ఒక జాతీయ సర్వేలో అధిక శాతం ఇండో అమెరికన్లు తాము డెమోక్రాట్ల వైపే ఉన్నట్టు వెల్లడించారు. నవంబర్ 3న 435 కాంగ్రెషనల్, 35 సెనెట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
ఆసియన్ అండ్ పసిఫిక్ ఐలాండర్ అమెరికన్ ఓటు (ఏఏపీఐ) నిర్వహించిన సర్వే ప్రకారం..ఓటర్లుగా నమోదైన ఆసియన్ అమెరికన్, పసిఫిక్ ద్వీపవాసులు 90 శాతం మంది రానున్న ఎన్నికల్లో ఓటు వేస్తామని చెప్పారు. వీరిలో 66 శాతం మంది ఇండో అమెరికన్లు తాము కాంగ్రెషనల్, సెనేట్లు రెండింటిలోనూ డెమోక్రాటిక్ అభ్యర్థులకే ఓటు వేస్తామని వెల్లడించారు. అలాగే 18 శాతం మంది రిపబ్లికన్లకు మద్దతు ఇస్తామన్నారు. కేవలం సెనేట్ ఎన్నికల పరంగా చూస్తే 22 శాతం మంది రిపబ్లికన్ అభ్యర్థులకు ఓటు వేస్తామని చెప్పారు.